వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వేగవంతం.. పులివెందులలో ఆ ప్రాంతాలను పరిశీలించిన సీబీఐ బృందం..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ వేగం పుంజుకుంది. వివేకా పీఏ ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్ అండ్ బీ గస్ట్ హౌస్‌లో మంగళవారం రెండు విడతలుగా సీబీఐ అధికారులు విచారించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ వేగం పుంజుకుంది. వివేకా పీఏ ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్ అండ్ బీ గస్ట్ హౌస్‌లో మంగళవారం రెండు విడతలుగా సీబీఐ అధికారులు విచారించారు. మంగళవారం ఉదయం ఇనయతుల్లాను అధికారులు విచారించారు. అనంతరం ఇనయతుల్లా, ప్రభుత్వ సర్వేయరు, వీఆర్వో, ప్రైవేట్ ఫొటో గ్రాఫర్‌లను సీబీఐ అధికారులు తమ వాహనాల్లో వెంటబెట్టుకొని పలు ప్రాంతాలను పరిశీలించారు. వైఎస్ వివేకా ఇంటి నుంచి చుట్టపక్కల నివసిస్తున్న కుటుంబ సభ్యుల నివాసాలకు మధ్య దూరాన్ని అధికారుల బృందం కొలిచినట్టుగా తెలిసింది.
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డికి ఒకప్పటి సన్నిహిత మిత్రుడు ఎర్ర గంగిరెడ్డి, ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి బయట, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి.. తదితరుల ఇళ్ల వద్ద కూడా సర్వే నిర్వహించి, వీడియోలు, ఫొటోలు తీయించినట్టుగా తెలుస్తోంది. విచారణలో ఇప్పటివరకు సేకరించిన సమాచారం మేరకు.. ఆయా ప్రాంతాలను పరిశీలించి.. ఫొటోలు, వీడియోలుతీయించారు. అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద సర్వే నిర్వహించారు. వివేకానంద రెడ్డి ఇంట్లోకి వెళ్లిన అధికారులు గంటకుపైగా అక్కడి పరిసరాలను పరిశీలించారు. తర్వాత సీబీఐ అధికారులు ఆర్ అండ్ బీ గస్ట్ హౌస్ చేరుకున్నారు. మరోసారి ఇనయతుల్లాను పిలిచి విచారణ జరిపారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో సీబీఐ అధికారులు కడపకు బయలుదేరి వెళ్లారు. ఇక, ఇందుకు సంబంధించి సీబీఐ బృందం గోప్యత పాటించింది. కేసు పురోగతిపై కూడా ఎటువంటి కామెంట్స్ చేయలేదు.
మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై కడప కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం కోర్టులో వాదనలు కొనసాగాయి. ఇక, ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీస్తున్నారు.