మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ సమయంలో రహస్య సాక్షి గురించి సీబీఐ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో రహస్య సాక్షి వివరాలు బయటకు వచ్చాయి. గతంలో ఈ కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ సమయంలో రహస్య సాక్షి గురించి సీబీఐ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రహస్య సాక్షి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం బయటకు వచ్చింది. ఆ రహస్య సాక్షి పులివెందుల వైకాపా నేత కొమ్మా శివచంద్రారెడ్డి అని తెలుస్తోంది. అతని వాంగ్మూలాన్ని గత నెల 30న కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఇక, ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని సీబీఐ నమోదు చేసింది.
ఈ వాంగ్మూలంలో కడప ఎంపీగా అవినాష్ పోటీ చేయరని వివేకానందరెడ్డి తనతో చెప్పారని కొమ్మా శివచంద్రారెడ్డి తెలిపారు. 2018 అక్టోబరు 1న వివేకా తన ఇంటికొచ్చారని.. వైసీపీని వీడొద్దని తనను కోరారని చెప్పారు. అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డితో పనిచేయలేనని ఆ సయమంలో తాను వివేకాకు తెలిపినట్టుగా పేర్కొన్నారు. వినాష్ రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు వివేకా చెప్పారని తెలిపారు. కడప ఎంపీగా విజయమ్మ లేదా షర్మిల పోటీ చేస్తారని వివేకా తనతో చెప్పారని తెలిపారు. వైఎస్ జగన్‌తో కూడా మాట్లాడినట్లు వివేకా తెలియజేశారని అన్నారు.
ఇక, 2018 అక్టోబరు 1 వరకు వైసీపీలో ఉన్న కొమ్మా శివచంద్రారెడ్డి సింహాద్రిపురం మండలం పార్టీ కన్వీనర్‌గా కొనసాగారు. అయితే 2018 అక్టోబరు 2న టీడీపీలో చేరిన కొమ్మా శివచంద్రారెడ్డి, తిరిగి 2020 జూన్‌లో వైసీపీలో చేరారు. వివేకా హత్య కేసుకు సంబంధించి సిట్.. 2019 డిసెంబరు 7న కొమ్మా శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని నమోదుచేసింది. అయితే సీబీఐ.. ఏప్రిల్ 26న మరోసారి కొమ్మా శివచంద్రారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
