మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడప పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ శ్రేణుల నుంచి తనకు ప్రాణహాని ఉందని కడప  ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడప పోలీసులను ఆశ్రయించారు. వైసీపీ శ్రేణుల నుంచి తనకు ప్రాణహాని ఉందని కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దస్తగిరి అక్కడికి వచ్చినప్పుడు ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందికి తన ఫిర్యాదును అందజేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు తనను అనుసరిస్తున్నారని దస్తగిరి తెలిపారు. తనను, తన కుటుంబాన్ని వైసీపీ నేతలు ఏమైనా చేస్తారని భయంగా ఉందని చెప్పారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యుల అరెస్ట్ తర్వాత తనపై కక్ష కట్టారని అన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని అన్నారు. తాను డబ్బులకు అమ్ముడుపోయానని నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి సిద్దమని చెప్పారు. నిరూపించకుంటే వాళ్లు పదవులకు రాజీనామా చేసి జైలుకెళ్తారా? అంటూ సవాలు విసిరారు. అవినాష్ రెడ్డి పదే పదే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైసీపీ, ఆయన అనుచరులను రెచ్చగొట్టేలా తనపై తప్పుడు అభియోగాలు చేస్తున్నారని చెప్పారు. తనకు ఏదైనా జరిగితే సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిలదే బాధ్యత అని అన్నారు. అలాగే తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కర్నూలు డీఐజీకి, సీబీఐ ఎస్పీని దస్తగిరి కోరారు. 

Also Read: సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెట్టబోతున్నాను.. సీఎం జగన్ కీలక ప్రకటన

ఇదిలా ఉంటే.. సోమవారం రోజు వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో దస్తగిరి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల నుంచి ఇప్పటికీ తనకు ప్రమాదం పొంచి ఉందని ఆరోపించారు. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను చెప్పినదాంట్లో నిజం ఉండటం వల్లే సీబీఐ అధికారులు అప్రూవర్‌గా చేశారని అన్నారు. ఆధారాలు లేకుండా సీబీఐ ఎవరినీ విచారించదు కదా అని అన్నారు. అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేస్తే సీబీఐకి ఏం లాభం అని ప్రశ్నించారు.

తాను అప్రూవర్‌గా మారడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారని.. తాను అప్రూవర్‌గా మారిన సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. వాళ్ల వరకు రానంతవరకు తాను మంచోడిని.. ఇప్పుడు చెడ్డ వ్యక్తినా అని ప్రశ్నించారు. తాను సీబీఐ నుంచి, వివేకానందరెడ్డి కూతురు సునీత నుంచి రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు.

అప్పుడు డబ్బుకు ఆశపడి ఎర్రగంగిరెడ్డి చెప్పినట్టుగా చేశామని తెలిపారు. ఇప్పుడు తనకు అవసరం లేదు కనుకే సీబీఐకి నిజం చెప్పేశానని చెప్పారు. పలుకుబడి ఉందని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌ను కూడా విచారణ నుంచి తప్పించేలా చేశారని అన్నారు. రామ్ సింగ్‌ను మార్చితే కొత్త బృందం కొత్తకోణంలో విచారిస్తుందా? అని ప్రశ్నించారు. ఈ కేసులో వారి పాత్ర తెలుసు కనుక ఎవరైనా అలాగే దర్యాప్తు చేస్తారని అన్నారు.