కడప: మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి ఇడుపులపాయలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలోనే వైఎస్సార్ సతీమణి విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైయస్సార్‌’’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. తన మాతృమూర్తి రాసిన ఈ పుస్తకాన్ని సీఎం జగన్‌ బుధవారం ఆవిష్కరించనున్నారు.

వైయస్సార్‌ సహధర్మచారిణి విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న ఆనూహ్యంగా వైయస్సార్‌ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం ఈ పుస్తకం. మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజలనుంచి తెలుసుకున్నానని...ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని విజయమ్మ తన తొలి పలుకుల్లో తెలిపారు. 

డాక్టర్‌ వైయస్సార్‌ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకం ఆవిష్కరించింది. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైయస్సార్‌ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో ఈ పుస్తకం ద్వారా విజయమ్మ వివరించారు. 

read more   ఇంకెంత దిగజారుతావు గుడ్డి విజనరీ...: చంద్రబాబుపై విజయసాయి సంచలనం

 వేసిన ప్రతి అడుగు వెనకా ఉన్న ఆలోచనను..అనుభవాల నుంచి వైఎస్సార్ నేర్చుకున్న పాఠాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు. ఆయన ఇంట గెలిచి రచ్చ గెలిచిన తీరును... ఇంట్లోవారి అవసరాలను అర్థం చేసుకున్నట్టే ప్రజలను కూడా కుటుంబ సభ్యులుగా భావించి వారి అవసరాలను కూడా  అర్థం చేసుకున్న విధానాన్ని వివరించారు. కుటుంబ సభ్యుల ప్రగతిని కోరినట్టే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతినీ కోరుకుని...అన్ని ప్రాంతాల్లో ఇంటింటా అందరికీ మేలు చేశారన్నారు. అందువల్లే తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా వైయస్సార్‌ను ఇప్పటికీ ఆరాధిస్తున్నారని పుస్తకం ముందుమాటలో ఆమె వివరించారు. 

వైయస్సార్‌ తన జీవితమంతా పెంచి,  పంచిన మంచితనమనే సంపద తన పిల్లలూ, మనవలకే కాకుండా... రాష్ట్రంలోని ప్రతి ఇంటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని సవినయంగా సమాజం ముందుంచుతున్నానని విజయమ్మ పేర్కొన్నారు. ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాని విజయమ్మ అన్నారు. 

తమ వివాహం, ఆనాటి పరిస్థితులు, పేదల డాక్టర్‌గా వైయస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటి నుంచి ఆయన నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, అందరివాడిగా గడిపిన జీవితం, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, చారిత్రక ప్రజా ప్రస్థానం, కొడుకు వైయస్‌ జగన్‌, కూతురు షర్మిలలతో..  కుటుంబాలతో మహానేత అనుబంధాలు, మహానేత మరణంతో ఎదురైన పెను సవాళ్ళు,   వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేవరకు పరిణామాలు... ఇవన్నీ ఈ పుస్తకంలో రేఖామాత్రంగా కొన్ని, వివరంగా మరి కొన్ని తెలిపారు. 

తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించి ఉన్న మరణం లేని మహానేత గురించి, తెలుగువారంతా తమ కుటుంబమే అనుకున్న మహానేత గురించి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజలముందుంచుతున్నానని విజయమ్మ అన్నారు. ఆయన జీవితమే తెరిచిన పుస్తకమని... ఆయన ప్రజాప్రస్థానంలో ప్రతి అడుగూ ప్రజల జీవితంతోనే ముడిపడి ఉందని విజయమ్మ వివరించారు. ఈ పుస్తకం ఎమెస్కో పబ్లికేషన్స్‌ మార్కెట్లోకి తీసుకువస్తోంది.