హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ కీలకమైన ప్రకటన చేశారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అభిమతాన్ని వెల్లడించారు. 

తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్ విజయమ్మ చెప్పారు. తన కుమారుడు జగన్ అవసరమనుకుంటే మాత్రం ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో విజయమ్మ విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. 

చాలా కాలంగా ఆమె పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. వైఎస్ షర్మిల కూడా పార్టీ కార్యకలాపాల్లో కనిపించడం లేదు. 

ఎపి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, అందుకే జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని విజయమ్మ అన్నారు. జగన్ పై దాడి విషయాన్ని అవహేళన చేయడం బాధ కలిగించిందని అన్నారు. ఎన్నికల్లో వైసిపి ఏకైక ఎజెండా ప్రత్యేక హోదా అని, ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. జగన్ పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెను పరిణామాలు చోటు చేసుకున్నాయని అభిప్రాయపడ్డారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో వైసిపి ఒంటరిగానే పోటీ చేస్తుందని, తమ పార్టీకి 120 శాసనసభ స్థానాలు వస్తాయని ఆమె చెప్పారు. వైఎస్ జగన్, షర్మిల పాదయాత్రల లక్ష్యం ఒక్కటేనని చెప్పారు.