కడప : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యాయత్నం కేసు దర్యాప్తుపై ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చనిపోయి పది రోజులు దాటినా ఒక్క క్లూ దొరకలేదని, విచారణ సరైన పద్ధతిలో నడుస్తుందో లేదో అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. 

తన తండ్రి హత్యకు సంబంధించి సీఐ శంకరయ్యపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. సంఘటనా స్థలంలో సీఐ శంకరయ్య ఉన్నా కేసు పెట్టకుండా తాత్సారం చేశారని ఆరోపించారు. తాము హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత కేసు పెట్టమని చెప్పాల్సి వచ్చిందన్నారు. 

కేసు పెట్టాలని బతిమిలాడుకున్నామని చెప్పుకొచ్చారు. జరిగింది హత్య అని చూస్తేనే తెలుస్తోంది అలాంటిది కేసు పెట్టాలని ఆయనకు తెలియదా తాము చెప్తే కానీ పెట్టరా అంటూ విరుచుకుపడ్డారు. అది హత్య అని సీన్‌లో లేని తమకే అనుమానం వస్తోంది. 

సీన్‌లో ఉన్న ఆయనకు తాము చెప్పాల్సి వచ్చిందని దాన్ని బట్టి చూస్తే ఆయన ఏదైనా కవర్ చెయ్యడానికి ప్రయత్నించాడా అంటూ సందేహం వ్యక్తం చేశారు. సీఐ ప్రవర్తనపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐ శంకరయ్య సమక్షంలోనే మృతదేహాన్ని తరలించారని, కట్లు కూడా కట్టారని సీఐకి తెలియదా అది తప్పు అని అంటూ చెప్పుకొచ్చారు. 

పంచనామా జరగకుండా మృతదేహాన్ని తరలిస్తుంటే సీఐ శంకరయ్య ఏమి చేశారని నిలదీశారు. ఎందుకు సీఐ అలా చేశారో అర్థం కాలేదని తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న తమ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ షాక్ లో ఉన్నారని తెలిపారు. 

అన్నీ తెలిసిన శంకరయ్య ఎందుకు అలా వ్యవహరించారని ప్రశ్నించారు. ఆయన కూడా ఈ క్రైమ్‌లో ఏమైనా భాగస్వామ్యులా?. ఆయనకు ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా?. ఈ నేరాన్ని తారుమారు చేయడానికి ఆయన పైన ఎవరున్నారు?. లేదా ఆయనే నేరుగా దీనిలో ఉన్నారా? నాకైతే అనుమానాలు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. 

ఈ ప్రశ్నలకు జవాబు దొరకడం లేదన్నారు. హత్యకోసం మా కుటుంబంపై నిందారోపణలు వేస్తున్నారని విమర్శించారు. తమ కుటుంబాన్ని విమర్శించే వారికి త్వరలోనే సమాధానం దొరుకుతుందని సునీతారెడ్డి స్పష్టం చేశారు.