వైఎస్ అవినాష్ రెడ్డికి ట్విస్టిచ్చిన సునీతారెడ్డి:: మధ్యంతర బెయిల్ పై సుప్రీంలో పిటిషన్
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ పై వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి గురువారంనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను రేపు విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తెలిపింది.
ఈ నెల 25వ తేదీ వరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు ఈ నెల 18వ తేదీన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై ఈ నెల 25న తుది తీర్పును ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 25వ తేదీ వరకు సీబీఐ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించుకోవచ్చని తెలిపింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని ఈ నెల 16న సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ఈ నెల 17వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రెండు రోజుల పాటు సుదీర్థగంగా విచారించిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 25వ తేదీ వరకు వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా వైఎస్ సునీతా రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కోరారు.
also read:వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట: ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దన్న తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు తీర్పుపై వైఎస్ సునీతారెడ్డి ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును కోరారు వైఎస్ సునీతారెడ్డి. ఈ నెల 25వ తేదీన తెలంగాణ హైకోర్టు తుదితీర్పు ఇవ్వనున్నందున ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ ను రేపు విచారిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ప్రకటించింది.ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు రపు ఏ రకమైన ఆదేశాలు జారీ చేస్తుందోననే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
2019 మార్చి 14న పులివెందులలోని తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ నెల 30వ తేదీలో పుగా ఈ కేసు విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ మరింత వేగం పెంచింది.