YS Sharmila: ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమవుతోంది. దీనికి భిన్నంగా, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల 'చలో అసెంబ్లీ' వంటి నిరసనలతో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల గొంతుకగా మారుతున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా మారింది వైసీపీ పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షంగా 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ.. ఇంతవరకూ ప్రజల తరపున రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితం చేసే ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడం గమనార్హం. అసెంబ్లీలోకి అడుగుపెట్టం గానీ.. ప్రజల్లోనే ఉంటూ వారికి అండగా నిలుస్తామని.. న్యాయం జరిగేలా చూస్తామని చెబుతూ వస్తోంది వైసీపీ. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా వరుసగా ప్రెస్ మీట్స్ పెడుతూ కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. కానీ ఎలాంటి ప్రభావం కనిపించట్లేదని విశ్లేషకులు అంటున్నారు.
వైఎస్ జగన్ వెర్సస్ షర్మిల
వైఎస్ జగన్, ఆయన పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెబుతూనే ఉన్నప్పటికీ, వారి నిరసనలు చిన్న, జిల్లా స్థాయి కార్యక్రమాలకే పరిమితం అయ్యాయి, అవి రాష్ట్రవ్యాప్తంగా బలమైన ప్రభావితాన్ని చూపలేకపోయాయి. కానీ మరోవైపు రాష్ట్ర పీసీసీ చీఫ్ శుక్రవారం అనగా సెప్టెంబర్ 26న రైతుల తరపున చేపట్టిన 'ఛలో అసెంబ్లీ' అనే కార్యక్రమం మాత్రం ప్రస్తుతం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. రైతులు పండించే ఏ పంటకు కనీస మద్దతు ధర అందడం లేదని.. చివరికి గిట్టుబాటు ధర కూడా దక్కట్లేదని వైఎస్ షర్మిల నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరైన మద్దతు ధర కల్పించాలంటూ సీఎం చంద్రబాబును కోరింది. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించినా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అయితేనేం వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా ఆమె ప్రజల సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే వ్యక్తిగా మారింది. ఇక ఇదే వైసీపీకి మైనస్ పాయింట్ గా మారనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
వ్యూహం మార్చిన షర్మిల
ఇప్పటిదాకా వైఎస్ జగన్, వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డ షర్మిల.. ఈసారి తన వ్యూహాన్ని మార్చుకుందని అంటున్నారు. ఇప్పటికైనా పలు కీలక విషయాన్ని వైసీపీ మౌనం వీడాలని.. తమ నిరసనలను రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితం చేసేలా ఉండాలని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రజల గొంతుకగా వైఎస్ షర్మిల ప్రతీసారి తన స్వరాన్ని వినిపిస్తే.. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఔచిత్యాన్ని మరింత బలహీనపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే, వైసీపీ పూర్తిగా మసకబారకముందే తన విధానాన్ని తక్షణమే పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు వాదన.
