తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బిసిలకు ఆర్థిక సాయం చేయాలన్న కేసీఆర్ కేబినెట్ నిర్ణయంపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బిసి కులవృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయలు ఇవ్వాలన్న కేబినెట్ నిర్ణయంపై వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది కాబట్టే కేసీఆర్ దొరకు బిసిలు గుర్తుకొచ్చారని అన్నారు. బిసిల ఓట్ల కోసమే దొర లక్ష రూపాయల ఆర్థిక సాయం అంటూ 'నయా'వంచనకు తెరలేపాడని షర్మిల అన్నారు.
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ డబ్బులు ఆశ చూపి మోసం చేస్తున్నాడని షర్మిల అన్నారు. ఇప్పటికే దళితబంధు పేరుతో దళితులను దగా చేశాడన్నారు. గిరిజనబంధు అంటూ ఊరించి గిరిజనులను ఉసూరు మనిపించాడని... ఇప్పుడు దొర బీసీలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా బీసీలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించి ఇప్పుడు లక్ష రూపాయల ఆర్థిక సాయం అంటున్నాడని అన్నారు. బిసిలకు 55వేల కోట్ల బడ్జెట్ అని చెప్పడమే కాని రూపాయి ఇచ్చింది లేదని షర్మిల అన్నారు.
స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి లోన్ ఇవ్వలేదని షర్మిల అన్నారు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదని అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే రూ.3 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. ఐదేండ్ల కింద హామీ ఇచ్చిన ‘బీసీ సబ్ ప్లాన్’ అటకెక్కిందన్నారు. 50 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైందని షర్మిల పేర్కొన్నారు.
Read More ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర
కేసీఆర్ మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాధాన్యతే లేదని షర్మిల అన్నారు.ఇక బిసీల ఆత్మగౌరవ భవనాలు పునాదులు దాటలేదని తెలిపారు. బీసీల కులగణన అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసిన కేసీఆర్ తెరచాటున కేంద్రంతో లాలూచీ పడుతున్నాడని షర్మిల ఆరోపించారు.
ఇక రాష్ట్రంలోని బీసీ బిడ్డలు బర్లు, గొర్లు కాచుకోవాలె... చేపలు పట్టుకోవాలె..కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలాల్నా? అని షర్మిల ప్రశ్నించారు. ఇన్నాళ్లు చిన్నచూపు చూసిన దొరకు రాష్ట్రంలోని 60లక్షల బీసీ కుటుంబాలు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నాయని షర్మిల అన్నారు.
