Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ కు షర్మిల భర్త అనిల్ షాక్: నర్మగర్భ వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎఎస్ జగన్ పట్ల ఆయన సోదరి వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పాలనపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు.

YS Sharmila husband Brother Anil makes comments against YS Jagan
Author
Vijayawada, First Published Mar 8, 2022, 8:04 AM IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఆయన సోదరి వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అర్థమవుతోంది. ఒక రకంగా బహిరంగంగానే అనిల్ జగన్ మీద అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల ద్వారా అనిల్ వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం కోసం పనిచేసిన క్రైస్తవులు ఇప్పుడు ఆవేదనతో ఉన్నారని బ్రదర్ అనిల్ అన్నారు. జగన్ పాలనపై వారి అభిప్రాయాలను తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. తనకు రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, త్వరలో శుభవార్త వింటారని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 

కాగా, బ్రదర్ అనిల్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తోంది. రెండేళ్లుగా వైఎస్ జగన్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఇటీవల రాజమండ్రిలో మాజీ ఎంపీ, వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తో అనిల్ బ్రదర్ సమావేశమైన విషయం తెలిసిందే. సోమవారంనాడు ఆయన విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు నాలుగు గంటల పాటు సమావేసం జరిగింది. 

బీసీ, ఎస్సీ, ఎస్సీ, ముస్లిం, క్రైస్తవ సంఘాలకు చెందన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను అనిల్ తెలుసుకున్నారు. జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని బ్రదర్ అనిల్ కుమార్ గత ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయం తెలిసిందే.  వివిధ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు విన్న తర్వాత బ్రదర్ అనిల్ కొద్ది సేపు మాట్లాడారు. త్వరలో శుభవార్త వస్తుందని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. 

ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ విషయం వేరేనని అనిల్ కుమార్ అన్నారు. తాను పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా లేనని అనిల్ కుమార్ అన్నారు. క్రైస్తవులకు అండగా ఉంటానని 2019 ఎన్నికల్లో తాను హామీ ఇచ్చానని, వారిని కలిసి చాలా రోజులైందని, అన్నారు. విజయవాడలో తాను జరిపిన సమావేశానికి ప్రత్యేక ఎజెండా ఏమీ లేదని స్పష్టం చేశారు. కాగా, మరో రెండు మూడు రోజుల్లో మరో సమావేశం నిర్వహించాలని అనిల్ కుమార్ భావిస్తున్నారు. విశాఖపట్నంలో లేదా గుంటూరులో ఆ సమావేశం నిర్వహించనున్నారు.

ఇదిలావుంటే, వైఎస్ జగన్ పట్ల ఆయన సోదరి వైఎస్ షర్మిల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని, అందువల్లనే తెలంగాణలో ఆమె రాజకీయ పార్టీ పెట్టారని ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె భర్త అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తుండడం రాజకీయంగా వేడిని రాజేస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios