ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు గూడెం క్రాస్ వద్ద జరిగిన రైతు గోస ధర్నాలో వైఎస్సార్ తెలంగాణ అధినేత్రి వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆమె విరుచుకుపడ్డారు.
ఖమ్మం: ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో యావత్ ప్రజానికం పోరాటం చేసింది. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరుతుందనే చాలామంది విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే వారి కల తెలంగాణ రాష్ట్రంలోనూ నెరవేరలేదని... టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (ys sharmila) ఆరోపించారు. కానీ వైఎస్సార్ టిపి (ysrtp) అధికారంలోకి వచ్చినవెంటనే మొట్టమొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదే వుంటుందని షర్మిల హామీ ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలో ప్రజాప్రస్థాన పాదయాత్ర (prajaprasthanam padayatra) చేపట్టిన వైఎస్ షర్మిల సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు గూడెం క్రాస్ దగ్గర జరిగిన రైతు గోస ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మరోసారి కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రి అయితే తెలంగాణ నాశనం అవుతుందన్నారు. ఇప్పటికీ కేసీఆర్ కే ఓటేస్తే భవిష్యత్ మిమ్మల్ని క్షమించదని... ఆయనను మళ్ళీ నమ్మితే మీ బిడ్డలే మిమ్మల్ని క్షమించరని అన్నారు.
పాలకులు మంచివాళ్ళు అయితేనే ప్రజలు చల్లగా ఉంటారని... అందుకోసమే వైఎస్సార్ లాంటి నాయకత్వం మళ్ళీ రావాలనే పార్టీ పెట్టానని షర్మిల అన్నారు. టీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు కాకుండా వైఎస్సార్ టిపికే ఎందుకు ఓటెయ్యాలో షర్మిల వివరించారు.
''కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా గెలిచిన నాయకులు టీఆర్ఎస్ కి మళ్ళీ అమ్ముడు పోతారు. ఇక బీజేపీకి ఓటేస్తే మతతత్వ రాజకీయాలు చేస్తారు. కేంద్రంలో అధికారంలో వున్నా బీజేపీ ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి అధికారంలోకి వచ్చాక మోసం చేసింది'' అని షర్మిల పేర్కొన్నారు.
''వైఎస్సార్ తెలంగాణ పార్టీని దీవించిన రోజున తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. ప్రతి నిరుపేద కుటుంబానికి మహిళ పేరుమీద పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం. ఈ ప్రభుత్వంలా కాకుండా ఇంట్లో ఎంతమంది వృద్దులు ఉంటే అంతమందికి పెన్షన్ ఇస్తాం. ఎస్సీ,ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం పని చేస్తాం. తెలంగాణ సంక్షేమం కోసం పని చేస్తా. ఓసీల్లో ఎంతోమంది పేదలు ఉన్నారు... వారి సంక్షేమం కోసం పని చేస్తాం'' అని షర్మిల తెలిపారు.
ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సిద్దారం గ్రామంలో నిన్న (ఆదివారం) షర్మిల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి అవసరమా? అని ప్రజలను ప్రశ్నించారు. ఉద్యమకారుడు కదా అని రెండుసార్లు అధికారం ఇస్తే రాష్ట్రప్రజల నెత్తిన టోపీ పెట్టాడని... చివరకు మంచం కోళ్లను సైతం ఎత్తుకు పోయే రకం ఈ కేసీఆర్ అంటూ ఎద్దేవా చేసారు. ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ వస్తాడు...ఈ సారి ఏ బీసీబందో... ఎస్టీ బందో అంటాడని షర్మిల అన్నారు.
వరి వేయడం ఈసారి శాపం అయ్యింది. సీఎం కేసీఆర్ ఊసరవెల్లిలా మాటలు మార్చి తెలంగాణ రైతులను బ్యాంక్ ల దగ్గర డీ ఫాల్టర్లుగా మిగిల్చారు. బ్యాంక్ వాళ్ళు రైతులను దొంగలుగా చూస్తున్నారు. కొన్నిచోట్ల రైతుల ఇళ్లను కూడా జప్తు చేస్తున్నారు. ఇలా అనేక సమస్యలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ కేసీఆర్ దే'' అని షర్మిల ఆరోపించారు.
