హైదరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో  సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతి సాధించారు. వైఎస్ షర్మిల తనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే 6 యూట్యూబ్ ఛానెల్స్ కు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియాలో గాసిప్స్ పై దర్యాప్తు ముమ్మరం చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు గుంటూరు జిల్లాకు చెందిన పలువురిని అరెస్ట్ చేశారు. 

తెనాలికి చెందిన పి.వెంకటేశ్వర్ సోషల్ మీడియాలో షర్మిలపై గాసిప్స్ ప్రచారం చేసినట్లు తేలడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. పి. వెంకటేశ్వర్ తెనాలిలోని ఆర్వీఆర్ కళాశాలలో ఎంసీఏ చదువుతున్నాడు. నిందితుడు వెంకటేశ్ ది  ప్రకాశం జిల్లాగా పోలీసులు గుర్తించారు.    

గత కొంతకాలంగా వైఎస్ షర్మిలపై అసభ్యకర పోస్టులను పెట్టడంతోపాటు అసభ్యకరమైన వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వెంకటేశ్వర్ అప్ లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 509, 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

పి. వెంకటేశ్వర్ ను హైదరాబాద్ తీసుకువచ్చిన పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్ షర్మిలపై గాసిప్స్ ప్రచారం చేసిన 16 యూట్యూబ్ లింక్ లను సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వారందర్నీ ప్రశ్నించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆఖరికి 6 యూట్యూబ్ ఛానెల్స్ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. 

తాజాగా వెంకటేశ్వర్ ను అరెస్ట్ చేశారు. అయితే వెంకటేశ్వర్ ఒక రాజకీయ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే షర్మిలపైనా, ఆమె వ్యక్తిగత జీవితంపై పోస్టులు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకటేశ్వర్ విచారణ అనంతరం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.