హైదరాబాద్: దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డితో తనకు రాజకీయాల్లోకి రాకముందు నుంచే మంచి మిత్రత్వం ఉండేదని మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య స్పష్టం చేశారు. మామధ్య స్నేహం చివరి క్షణం వరకు చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు. 

తన రాజకీయ జీవితంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. మాజీఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రచించిన వైయస్సార్ తో ఉండవల్లి అరుణ్ కుమార్ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. 

వైఎస్‌ అంటే మంచి స్నేహితుడు, కల్లాకపటం లేని వ్యక్తి అని రోశయ్య కొనియాడారు. అంతేకాదని వైఎస్ ఆర్ ఓ అరుదైన మిత్రుడంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఇంకా ఉండాల్సిన సమయం, వయసు ఉన్నా వైయస్సార్‌ దూరమవడం కలచివేసిందన్నారు. 

ఇలాంటి వేదికలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనమధ్య లేరు అని చెప్పేందుకు బాధగా ఉందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎలాంటి సమస్యలు గానీ బాధలు ఉన్నప్పుడు ఎవరికీ చెప్పకుండా మనసులోనే సర్ధిచెప్పుకునే వ్యక్తి అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన సమయంలో దురదృష్టవశాత్తు చనిపోవడం బాధాకరమన్నారు. ఒక మంచి మిత్రుడును కోల్పోయి బాధతో ఉన్నానని మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య వ్యాఖ్యానించారు.