మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు.

విశాఖపట్నం: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఆ పార్టీలో చేరిన యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు దౌత్యం నెరపుతున్నట్లు సమాచారం. 

విశాఖపట్నం జిల్లాలో ఎంపి విజయసాయి రెడ్డి పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆందులో భాగంగానే గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన కొణతాలను తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు. కన్నబాబురాజు గత పది రోజుల్లో మూడు సార్లు కొణతాలను కలిసి పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అనకాపల్లి లోక్‌సభ టికెట్‌ ఇస్తారని హామీ కూడా ఇచ్చినట్లు తెలిసింది. అయితే కొణతాల నుంచి స్పందన రాలేదని, దాంతో కన్నబాబురాజు విషయాన్ని వైఎస్‌ విజయలక్ష్మికి, విజయసాయిరెడ్డికి తెలిపారు. వారిద్దరు కూడా ఆయనతో ఫోన్‌లో మాట్లాడి పార్టీలోకి రావాలని కోరినట్లు సమాచారం. 

అయితే కొణతాల ఏ విషయమూ స్పష్టంగా చెప్పలేదని అంటున్నారు. త్వరలోనే తన నిర్ణయం చెబుతానని మాత్రమే ఆయన అన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ కూడా ఆయనపై దృష్టిసారించినట్లు సమాచారం. కాంగ్రెసులోకి రావాలని విశాఖ నగరానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ద్వారా రాయబారం నడిపినట్లు ప్రచారం జరుగుతోంది.