తిరుమల: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంపెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. 

వైయస్ జగన్ కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. వైయస్ జగన్ వెంట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా, అవంతి శ్రీనివాస్ లు ఉన్నారు. 

ఎమ్మెల్యేలతోపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు సైతం వైయస్ జగన్ తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం వైయస్ జగన్ కడప జిల్లా వెళ్లనున్నారు. 

కడపలోని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతోపాటు, సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు జగన్. అలాగే గండి ఆజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు వైయస్ జగన్. సాయంత్రానికి విజయవాడ చేరుకుని తాడేపల్లిలోని ఆయన స్వగృహానికి చేరుకోనున్నారు. 

గురువారం మధ్యాహ్నాం 12.23 నిమిషాలకు వైయస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేబోతున్నారు. ఇకపోతే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో అన్ని మతాలకు ప్రాధాన్యతనిస్తూ సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. 

ఇకపోతే వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర చేపట్టబోయే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ప్రజాసంకల్పయాత్ర ముగింపు అనంతరం వైయస్  జగన్మోహన్ రెడ్డి కాలినడకన స్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న తరుణంలో మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు.