హైదరాబాద్: తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని పరామర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. 

ఈ ఎన్నికల్లో కుప్పంనుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రమౌళి పోటీ చేస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఎన్నికల ప్రచారంలో కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. తీవ్రంగా అనారోగ్యం పాలవ్వడంతో కుటుంబ సభ్యులు ఆయన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. 

సమాచారం అందుకున్న వైఎస్ జగన్ అపోలో ఆస్పత్రికి వెళ్లి చంద్రమౌళిని  పరామర్శించారు. తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. చంద్రమౌళికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. చంద్రమౌళి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. 

చంద్రమౌళి కోలుకుంటారని ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరోవైపు అదే అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వైసీపీ సీనియర్ నేత నరిశెట్టి ఆచార్యులు సతీమణిని కూడా వైఎస్ జగన్ పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.