విశాఖపట్నం: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి ఇది వస్తువు పోయినప్పుడు కొట్టే డైలాగ్. ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలిచి తన సత్తా చూపాలి అనేది రాజకీయాల్లో తరచూ వినిపించే నానుడి. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ విషయంలో. 

ఒకప్పుడు ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన వైయస్ జగన్ ను అడ్డుకున్న పోలీసులు రెండేళ్ల అనంతరం ముఖ్యమంత్రి హోదాలో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కి వచ్చేసరికి అడ్డుకున్నవాళ్లే ఘన స్వాగతం పలకడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

 విశాఖపట్నంలోని శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకునేందుకు ఆయన విశాఖపట్నం విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం చేరుకున్న సీఎం వైయస్ జగన్ కు పోలీసులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

జగన్ విశాఖపట్నం విమానాశ్రయం చేరుకోవడం కట్టుదిట్టమైన భద్రత నడుమ జగన్ రావడం చూసిన పలువురు జగన్ కు గతంలో ఎదురైన పరాభవంపై చర్చించుకున్నారు. వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా 2017 జనవరి 26న విశాఖపట్నం ఆర్కేబీచ్ లో తలపెట్టిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు.

 విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో వైయస్ జగన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి రాకుండా పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణీకులు బయటికి రాకుండా స్థానిక పోలీసులు ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. 

ఎలా ప్రవర్తించాలో తెలియని వాళ్లు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఎలా ఉంటారయ్యా అంటూ నిలదీశారు. ఎయిర్‌ పోర్టు లాంజ్‌ లో ఉన్న పోలీసులను మీ ఐడీ కార్డులు చూపించండి అని ప్రశ్నించారు. ఐడీ కార్డులు చూపించకపోవడంతో మీరు అసలు పోలీసులేనా అంటూ జగన్ వారిని కడిగిపారేశారు. 

జగన్ ప్రశ్నలకు సివిల్ డ్రస్సులో ఉన్న పోలీసులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఎయిర్ పోర్ట్ లోకి  సివిల్ పోలీసులు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. సివిల్ పోలీసుల నిలువరించడంపై ఎయిర్ పోర్ట్ అథారిటీని సంప్రదించినా ఆనాడు ఎలాంటి సమాధానం రాలేదు. 

రెండేళ్లు ఒపికపట్టండి. అందర్నీ గుర్తు పెట్టుకుంటా. ఎవరిని మరచిపోను అంటూ జగన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. అనంతరం పోలీసుల తీరును నిరసిస్తూ విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో రన్ వేపై బైఠాయించారు. ఎయిర్ పోర్ట్ రన్ వేపై ఆందోళనకు దిగడం ఏపీలో అదే తొలిసారికావడం విశేషం.  

ఆనాడు అడ్డుకున్న పోలీసులు ఈనాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ఘన స్వాగతం పలకడం, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనకు రక్షణగా నిలవడం పట్ల అంతా ఆనందం వ్యక్తం చేశారు. ఏచోట అయితే అడ్డుకున్నారో అదే చోట ఘన స్వాగతం పలికేలా చేసుకున్న ఏకైక నాయకుడు వైయస్ జగన్ అంటూ వైసీపీ నేతలు చెప్తున్నారు.