అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూర్పుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా హర్షం వ్యక్తం చేస్తోంది. వ్యూహాత్మకంగా ఎవరి అంచనాలకు అందకుండా జగన్ తన కేబినెట్ కూర్పు చేశారు. ప్రజా సంకల్పయాత్రలో, పార్టీలో చేరినప్పుడు జగన్ హామీ ఇచ్చిన వారందరికీ మంత్రి పదవులు దక్కాయని తెలుస్తోంది. 

అయితే గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంకు చెందిన కీలక నేత మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో పర్యటించిన జగన్ చిలకలూరిపేట నియోజకవర్గ అభ్యర్థి విడదల రజనీని గెలిపిస్తే మర్రి రాజశేఖర్ ను మంత్రిని చేస్తానంటూ లక్షలాది మంది సాక్షిగా జగన్ హామీ ఇచ్చారు. 

జగన్ హామీతో నియోజకవర్గం కార్యకర్తలంతా సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో విడదల రజనీ గెలవడం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఖాయమని నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. 

జగన్ హామీ ఇవ్వడంతో ఇక ఏపీ కేబినెట్ లో మర్రి రాజశేఖర్ కు అంతా మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ అనూహ్యంగా జగన్ ఆయనకు మెుండి చేయి చూపడంతో అంతా నివ్వెరపోయారు. మర్రి రాజశేఖర్ అభిమానులు నిరాశ చెందారు. 

వాస్తవానికి నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు మర్రి రాజశేఖర్. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత 2019లో టికెట్ ఆయనకు ఇవ్వకుండా విడదల రజనీకి ఇచ్చారు జగన్. 

విడదల రజనీ కోసం టికెట్ సైతం త్యాగం చేశారు. అంతేకాదు నియోజకవర్గంలో గెలుపుకోసం అహర్నిశలు శ్రమించారు. ఆయన శ్రమకు తగ్గ ప్రతిఫలం వస్తుందని అంతా భావించినా చివరలో నిరాశే మిగిలింది. 

అయితే వైయస్ జగన్ మాటతప్పడు మడమ తిప్పడంటూ రాజకీయాల్లో పేరుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మర్రి రాజశేఖర్ కు రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అంటే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి దక్కాలంటే మరో రెండున్నరేళ్లు వేచి చూడాల్సిందేనన్నమాట.