విజయవాడ: ప్రజా జీవితంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రాజకీయాల్లో కొనసాగాలని తాను నిర్ణయించుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధన కోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. 

తన తండ్రి ఆశయ సాధన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యం కాదని తెలియడంతో పార్టీ వీడినట్లు తెలిపారు. తనను తమ్ముడికంటే ఎక్కువగా అన్న వైఎస్ జగన్ తనకు అన్యాయం చేశారని వాపోయారు. తనకే ఇలా చేస్తే ప్రజలకు జగన్ ఏం చేస్తారని ప్రశ్నించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు బాధలు భరించానని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి మోహన్ రంగ విగ్రహావిష్కరణకు వెళ్తే పర్మిషన్ తీసుకోవాలని వైసీపీ అడగడం బాదేసిందన్నారు. 

తన తండ్రి విగ్రహావిష్కరణకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తన తండ్రి అభిమానులను సంతృప్తి పరచాలన్నదే తన లక్ష్యమన్నారు. తాను ఏం చేసినా జగన్ ఆదేశాలు తీసుకోవాలని చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందని అది తన వల్ల కాదన్నారు. 

తండ్రి చనిపోయిన వ్యక్తివి కాబట్టి నీపై జాలి చూపిస్తున్నానని వదిలేస్తే గాలిలో  కొట్టుకుపోతావ్ అంటూ జగన్ హెచ్చరించారని ఆ మాటలు పదేపదే చెప్పడం తట్టుకోలేకపోయానన్నారు. వైఎస్ జగన్ తన పద్దతులు మార్చుకోవాలని హితవు పలికారు. వైఎస్ జగన్ వంగవీటి మోహన్ రంగా అభిమానులను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. 

వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత వైసీపీ అభిమానులు తనను చంపుతానని బెదిరించారని వంగవీటి రాధా చెప్పారు. సోషల్ మీడియాలో తనను కించపరుస్తూ పోస్టులు పెట్టారని చంపేస్తామంటూ హెచ్చరించారని చంపేస్తే చంపెయ్యాలని కోరారు. 

తనను చంపేస్తే మీకు మంచి జరుగుతుందంటే చంపెయ్యండన్నారు. తాను ఐపీ అడ్రస్ లు పట్టుకుని విచారణ చేపడితే తనపై వేధించిన వారి పరిస్థితి ఏంటని నిలదీశారు.

 

నాకు రూ.100కోట్లు ఏనా కొడుకు ఇచ్చాడు: వంగవీటి రాధా

జగన్ వార్నింగ్ ఇచ్చారు, అవమానించారు: వంగవీటి రాధా సంచలనం