Asianet News TeluguAsianet News Telugu

‘గడప గడపకు..’ కార్యక్రమంలో బూతులతో రెచ్చిపోయి వ్యక్తిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన వ్యక్తిపై బూతులు తిడుతూ, చేయి చేసుకున్నారు. 

YS Jagan Uncle, MLA Ravindranath Reddy slapped a person in 'Gadapa Gadapaku..' programme,  video viral
Author
First Published Nov 3, 2022, 8:48 AM IST

కడప : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పిన వ్యక్తిపై చేయి చేసుకోవడంతో పాటు రాయలేని భాషలో బూతులు తిట్టిన వ్యవహారాన్ని సొంత పార్టీవారే ఆలస్యంగా వెలుగులోకి తెచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వైఎస్ఆర్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం గ్రామంలో వారం క్రితం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు.

తహసిల్దార్ ఉదయ భారతితో ఆయన మాట్లాడుతుండగా తన భూమి సర్వే నెంబర్లను దస్త్రాలు నమోదు చేయడం లేదని దేశాయి రెడ్డి ప్రస్తావించారు. తన సమస్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉందంటూ చెబుతుండగా ఆయనపై ఎమ్మెల్యే ఆగ్రహంతో చేయిచేసుకున్నారు. బూతులు అందుకుని రెండోసారి చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు, నాయకులు కలిసి బాధితుడిని పక్కకు తీసుకువెళ్లి ఎమ్మెల్యేను శాంతింప చేసే ప్రయత్నం చేశారు.  ఘటన బయటకి పొక్కకుండా ఎమ్మెల్యే అనుచరులు జాగ్రత్తలు తీసుకున్నా..  ఎమ్మెల్యే తీరును జీర్ణించుకోలేని ఓ నేత బుధవారం ఉదయం ఈ వీడియోను బయటపెట్టారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్

మదనపల్లిలో కూడా.. అర్జీదారుడికి అవమానం… 
మదనపల్లిలో తమ గోడును వెళ్లబోసుకోవడానికి వచ్చిన అర్జీదారు ప్రకాష్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లి ఎంపీడీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇంటి స్థలం విషయమై  రామచార్లపల్లెకు చెందిన కార్మికులు ప్రకాష్ తో పాటు పలువురు బాధితులు అర్జీలు ఇచ్చేందుకు వచ్చారు. వలసపల్లి పంచాయతీలో పండ్ల గుజ్జు పరిశ్రమలో పనిచేస్తున్న 300 మందికి 1994లో ఇంటి పట్టాలు ఇచ్చారు. ఆ స్థలాన్ని రూ. నాలుగు లక్షలతో లబ్ధిదారులు చదును చేసుకున్నారు. 

అక్కడ ఫ్లాట్లు కేటాయించకపోవడంతో ఇదివరకే ఉన్నతాధికారులకు ఆర్జీలు సమర్పించుకున్నారు. అక్కడ లేఅవుట్ వేసి ప్లాట్లు ఇవ్వాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఎంపీ మిథున్ రెడ్డికి  అర్జీ  అందజేసి  సమస్యను వివరించారు. ఇటీవల తమకు కేటాయించిన స్థలాన్ని కేంద్రీయ విద్యాలయం బదలాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వైసిపి కార్యకర్తలు అతడిని బయటికి నెట్టుకుంటూ తీసుకు వెళ్లారు. అక్కడినుంచి పోలీసులు బయటకు పంపేశారు. ఈ ఘటన ఎంపీ ఎదుటే జరుగుతున్నా.. ఆయన చూస్తూ ఉండిపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios