తనపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న అంచనాలను అందుకుంటానని ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయానికి చేరుకున్న జగన్‌కు ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ సచివాలయానికి రావడం ఇదే తొలిసారి. 

ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు. ఆ తర్వాత తన ఛాంబర్‌లో తొలి సంతకం చేసి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు జగన్. అనంతరం సచివాలయం ఉద్యోగులు, కొత్తగా ఎంపికైన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు.. జగన్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

కాగా... ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ కి జగన్ తన వ్యక్తిగత ట్విట్టర్ నుంచి స్పందించారు. ‘‘ దేవుడు, ప్రజల దీవెనలతో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని.. ప్రజల అంచనాలను అందుకుంటాను’’ అని ట్వీట్ చేశారు.