హైదరాబాద్: గురువారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు రాష్ట్రరాజధాని అమరావతి చెంతకు చేరుకుంటున్నారు. గురువారం వెలువడనున్న ఎన్నికల ఫలితాలను అమరావతిలోని పార్టీ కార్యాలయాల్లో నేతలతో కలిసి వీక్షించేందుకు అన్ని పార్టీల అధినేతలు రెడీ అయ్యారు. 

అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతికి బయలుదేరారు. వైఎస్ జగన్ తోపాటు పలువురు కీలక నేతలు సైతం జగన్ వెంట ఉన్నారు. 

ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు సైతం ఇప్పటికే అమరావతి సమీపంలోని తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో జగన్ విజయవాడ చేరుకోనున్నారు. గురువారం పార్టీకీలక నేతలతో కలిసి ఆయన ఎన్నికల ఫలితాలను వీక్షించనున్నారు. 

ఇకపోతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం అమరావతి చేరుకున్నారు. రెండురోజులుగా ఆయన అమరావతిలోనే ఉంటున్నారు. గురువారం పార్టీ కార్యాలయంలోనే పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ఫలితాలను వీక్షించనున్నారు. 

అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం కుప్పం నుంచి నేరుగా ఉండవల్లి చేరుకున్నారు. గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నివాసాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.