అమరావతి: ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరు కానున్నారు. సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లు, ఈడీ వేసిన 5 అభియోగపత్రాలపై విచారణకు హాజరుకానున్నారు. 

ఉదయం 8 గంటల 50 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదు బయలుదేరుతారు. ఉదయం పదిన్నర గంటలకు కోర్టుకు చేరుకుంటారు. విచారణ పూర్తిచేసుకొని పదకొండున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరుగు పయనమవుతారు. 

ముఖ్యమంత్రి అయ్యాక అక్రమాస్తుల కేసు విచారణకు జగన్ హాజరవుతుండటం ఇది రెండోసారి. సీబీఐ, ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను కోర్టు గతంలో తోసిపుచ్చింది. 

సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ... జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టులో ఈ నెల 12న విచారణ జరగనుంది. పలుమార్లు ఎప్పటికప్పుడు ఆయన వ్యక్తిగత మినహాయింపు తీసుకుంటూ వస్తున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున హాజరు నుంచి వ్యక్తిగ మినహాయింపు ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ ను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాల్సిన ఉన్నందున వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.