రాజకీయాల్లో ఒక కామెంట్ కానీ, ఆరోపణను కానీ అవతలి పార్టీ చేసినప్పుడు సాధ్యమైనంత త్వరగా   దానికి కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా స్పందించడం ఆలస్యమవుతున్న కొద్దీ రాజకీయంగా ఇమేజ్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలా ఆరోపణలమీద స్పందన ఆలస్యమయ్యేకొద్దీ ప్రజల్లో అనేక ఊహాగానాలకు ఆస్కారం కల్పించిన వారవుతారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదు. అన్ని రాజకీయ పార్టీలు జాతీయ స్థాయి నుంచి మొదలుకొని ప్రాంతీయ పార్టీల వరకు ఈ సూత్రం వర్తిస్తుంది. 

రాజకీయంగా చాలా ఆక్టివ్ గా ఉండే వైసీపీ పార్టీకి ఇది తెలియంది కాదు. కానీ బీజేపీ విషయంలో మాత్రం వారు ఇలాంటి తప్పునే చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. రాజకీయంగా శత్రువుల దాడులకు వెంటనే కౌంటర్ ఇచ్చే వైసీపీ, బీజేపీ విషయంలో మాత్రం ఇలా ఎందుకు చేస్తుందో వారికే తెలియాలి. 

అధికారంలోకి రాకముందు, ఎటువంటి ఆరోపణనైనా సమర్థవంతంగా తిప్పికొట్టేది వైసీపీ నాయకత్వం.  అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రతిస్పందన సమయం మరింతగా తగ్గింది. వారు ఏ ఒక్క అవకాశాన్ని, మాధ్యమాన్ని వదలకుండా తమ స్టాండ్ ని వినిపిస్తున్నారు. ఇలాంటి స్పందనలు కేవలం టీడీపీ, జనసేన చేసిన ఆరోపణలపైన మాత్రమే మనకు కనపడుతున్నాయి. బీజేపీ విషయంలో మాత్రం కాస్త ఉదాసీన వైఖరి మనకు కనపడుతుంది. 

కన్నా లక్షనారాయణ నుంచి మొదలుకొని ఎందరో బీజేపీ నేతలు వైసీపీ పైన విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. రెండు రోజుల కింద బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఒక రెండడుగులు ముందుకేసి మరీ, బీజేపీ సహకారం లేకపోతే కనీసం 40 సీట్లను కూడా వైసీపీ గెలిచేది కాదని అన్నారు. సహజంగా ఇలాంటి విమర్శ రాగానే వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుందని మనం భావిస్తాం. కానీ ఆలా జరగలేదు. 

ఇప్పటికే జగన్ అన్యమతస్థుడంటూ అడపా దడపా కామెంట్ చేసే బీజేపీ, మొన్న విజయవాడలోని గోశాలలో ఆవుల మరణానంతరం ఆ విషయాన్ని బలంగా ప్రచారం చేస్తూ అదే ప్రధాన అజెండాగా ఎత్తుకుంది. ఈ విషయమై వైసీపీ ఛోటా మోటా  నేతలు మాట్లాడుతున్నారు తప్ప జగన్ కానీ, అతని కార్యాలయం కానీ ఈ విషయాన్ని గురించి పూర్తి స్థాయి కౌంటర్ ఇవ్వడంలో విఫలమైంది. 

ఏ చిన్న విషయాన్ని కూడా వదలకుండా ట్విట్టర్ వేదికగా స్పందించే విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంపైన స్పందించలేదు. సోషల్ మీడియా నుంచి మొదలుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వైసీపీ ముఖంగా ఉండే విజయసాయిరెడ్డి సైతం  కౌంటర్ ఇవ్వకపోవడంతో అనేక ఊహాగానాలు బయల్దేరాయి. 

ఈ పరిణామాలన్నిటిని పరిశీలిస్తే జగన్ కేంద్ర సర్కారుకు భయపడుతున్నాడా  అనే అనుమానం కలుగక మానదు. బీజేపీతో పెట్టుకున్న చంద్రబాబు పరిస్థితి కూడా జగన్ ని  కలవరపెడుతుండొచ్చు. రాజకీయంగా ఇప్పుడు బీజేపీ చాలా బలంగా ఉంది. వారి అనుకూల పవనాలు దేశమంతా వీస్తున్నాయి. వారిని ఇప్పుడు ఎదిరించి నిలవడం అంత తేలికైన విషయం కాదు. బీజేపీ అంటేనే ఒంటికాలిపైన లేచే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుత పరిస్థితేంటో మనకు తెలియంది కాదు. మోడీని మెచ్చుకుంటూ తరచూ  కేజ్రీవాల్ పెట్టే ట్వీట్లను మనమందరం చూస్తున్నాము కూడా. 

ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ, ఇలా బీజేపీ కామెంట్స్ కి కనుక కౌంటర్ ఇవ్వడం ఆలస్యమైనా, ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి లేని స్పేస్ ని వైసీపీ తమంతట తామే ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే  టీడీపీని ఖాళి చేయడం ద్వారా తమ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు బీజేపీ నేతలు. ప్రజల నోళ్లలో నానేందుకు  ప్రతిపక్షం టీడీపీ కన్నా రెండు ఆరోపణలు ఎక్కువగానే చేస్తున్నారు కూడా. ఇలా చేయడం ద్వారా ప్రధాన ప్రతిపక్షం తామే అని ప్రజల ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. 

ఇలానే గనుక బీజేపీ పట్ల ఉదాసీనతను కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో జగన్ పశ్చాత్తాప పడక తప్పదు.