వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. విశ్రాంతి లేకుండా పాదయాత్ర చేస్తుండటంతో ఆరోగ్యం దెబ్బతిన్నది. నాలుగు రోజులుగా జలుబు, గొంతునొప్పి, కాళ్ళ నొప్పులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. డస్ట్ ఎలర్జీ వల్లే పై సమస్యలే కాకుండా కళ్ళనుండి నీళ్ళు కూడా కారుతున్నట్లు సమాచారం. నవంబర్ 6వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.

 

రోజూ ఉదయం నుంచీ సాయంత్రం వరకూ పాదయాత్ర చేస్తున్నందున  పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానుల ఆయన వెంట అడుగులేస్తున్నారు. దట్టంగా లేస్తున్న దుమ్ము జగన్‌ను చుట్టేసి డస్ట్‌ అలర్జీకి కారణమవుతోంది. అయినప్పటికీ పాదయాత్రలో ఎదురొచ్చే అభిమానులు, ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ యథావిధిగా నడక కొనసాగిస్తున్నారు.

 

                                                                                                                                                                                                         సరిపోని నిద్ర, పెరిగిన అలసట

చిత్తూరు జిల్లాలో డిసెంబర్‌ 28 నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. రోజూ రాత్రి పూట పనులన్నీ పూర్తి చేసుకుని, తనను కలిసేందుకు వచ్చిన వారందరితో మాట్లాడుతున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం, మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేస్తుండటంతో నిద్ర సరిపోవటం లేదు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలోనూ పలువురితో సమావేశమవుతూనే ఉన్నారు.  దాంతో విశ్రాంతి కరువైంది. అప్పుడప్పుడూ భోజన విరామానికి సైతం ఆగకుండా నడక సాగిస్తున్నారు. దానివల్ల సాయంత్రానికి అలిసిపోతున్నారు.

 

                                                                                                                                                                                                                       పాదాల కింద బొబ్బలు

రోడ్ల వెంట లేస్తున్న దుమ్మూ ధూళి కారణంగా విపక్ష నేత జుట్టంతా తెల్లగా మారుతోంది. దుమ్ము నోటిలోకి పోతుండడంతో గొంతునొప్పి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు కారణంగా జగన్‌ కు మాట కూడా సరిగా రావటం లేదు.  శుక్రవారం పాదయాత్ర మొదలైంది మొదలు జలుబు, తుమ్ములతో సతమతమయ్యారు. ఇడుపులపాయలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ జగన్‌ అరున్నర కిలోల బరువు తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. కనీసం రెండు రోజులైనా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నా  జగన్‌ పట్టించుకోలేదు. షెడ్యూల్‌ ప్రకారం పాదయాత్ర కొనసాగాల్సిందేనంటూ స్పష్టం చేస్తున్నారు.