చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రైతులు పూర్తిగా మోసపోయారని, చంద్రబాబే దళారిగా మారి రైతులను దళారులకు అమ్మేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదని, రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని, చంద్రబాబు సీఎం కావడంతో ఆయనతోపాటు కరువు కూడా వచ్చిందని అన్నారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని నెమళ్లగుంటపల్లిలో జగన్‌ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. దేవుడి దయతో రేప్పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేయడానికి ప్రత్యేక పథకాలు అమలుచేస్తామని హామీ ఇచ్చారు.  ప్రతి ఒక్క రైతు కుటుంబంలోనూ ఆనందాన్ని నింపుతామని వైఎస్‌ జగన్‌ భరోసా నింపారు.  మన పాలనలో అనుసరించాల్సిన విధానాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలని రైతులను కోరారు. తర్వాత వ్యవసాయరంగంపై రైతులు పలు సూచనలు చేశారు.