అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో చేరే శాసనసభ్యులకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫోన్లు చేశారు. జగన్ ఎదురుగా ఉండి విజయసాయిరెడ్డితో ఫోన్లు చేయించినట్లు తెలుస్తోంది. రేపు శనివారం మంత్రుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్న విషయం తెలిసిందే.

మంత్రివర్గ సభ్యుల జాబితాను గవర్నర్ నరసింహన్ కు అందించి, ఆమోదం పొందిన తర్వాత విజయసాయి రెడ్డి చేత జగన్ ఫోన్లు చేయించారు. ఒక్కొక్కరికి విజయసాయి రెడ్డి ఫోన్లు చేస్తుండగా, జగన్ ఎదురుగా కూర్చున్నారు. 

మేకతోటి సుచరితతో మాత్రం వైఎస్ జగన్ స్వయంగా మాట్లాడారు. ఆమెతో విజయసాయి రెడ్డి మాట్లాడిన తర్వాత వైఎస్ జగన్ ఫోన్ అందుకుని మాట్లాడారు. ఆల్ ద బెస్ట్ అంటూ వైఎస్ జగన్ ఆమెకు చెప్పారు. మేకతోటి సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పై విజయం సాధించారు. 

మేకతోటి సుచరితతో మాట్లాడిన తర్వాత ఫోన్లు చేసే విషయంలో విజయసాయి రెడ్డి, జగన్ కాస్తా విరామం తీసుకున్నారు. వారిద్దరు కొంత సేపు సంభాషించుకున్నారు.