ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనను సీఎం వైఎస్ జగన్ స్మరించుకున్నారు. తన తండ్రి మరణం లేని మహానేత అంటూ ప్రశంసలు కురిపించారు. తన తండ్రి జయంతి రోజే.. రైతు బంధు పథకం మొదలుపెట్టడం తనకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన సంతోషాన్ని  వ్యక్తం చేశారు.

‘నాన్న గారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే. రైతుపక్షపాతి అయిన మహానేత జయంతిని రైతుదినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. 

 

కాగా.. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా.. వైసీపీ నేత విజయసాయి రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘రైతు బాంధవుడు వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తండ్రీ, కొడుకులకు ప్రజలంటే అంతులేని ప్రేమ. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్. పేదల పక్షపాతిగా నిలిచిన ఆయన 71వ జయంతిని ఘనంగా జరుపుకుందాం. ఆయన సేవలను మననం చేసుకుందాం.’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.