వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం: మూడో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్
ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసినట్టుగా చెబితే టీడీపీ నేతలు 95 శాతం అన్యాయాలు అంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు.
అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసినట్టుగా చెబితే టీడీపీ నేతలు 95 శాతం అన్యాయాలు అంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. మంగళవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ వాహనమిత్ర పథకం కింద నిధులను విడుదల చేశారు. 2.48 లక్షల మంది డ్రైవర్లు ఈ పథకం కింద లబ్దిపొందనున్నారు. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద మూడో విడత నిధులను సీఎం జగన్ ఆర్ధిక సహాయం విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్దిదారులతో మాట్లాడారు. పండ్లున్న చెట్టుకే దెబ్బలు అనే నానుడిని ఆయన ప్రస్తావిస్తూ మంచిచేసే తమ ప్రభుత్వంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొంటున్నామని ఆయన చెప్పారు . పాదయాత్రలో డ్రైవర్ల సమస్యలను తాను స్వయంగా చూసినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. టీడీపీ ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్లను పెనాల్టీలతో వేధింపులకు గురి చేసిందని ఆయన విమర్శించారు.
వాహనమిత్ర పథకం కింద ఇప్పటివరకు డ్రైవర్లకు రూ. 30 వేల ఆర్ధిక సహాయం అందించినట్టుగా ఆయన తెలిపారు. గత ప్రభుత్వం పన్నులు, చలాన్ల రూపంలో ఆటో డ్రైవర్ల నుండి కోట్లాది రూపాయాలను వసూలు చేశారని ఆయన వివరించారు. ఈ పథకం కింద లబ్ది పొందని వారు ధరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.