Asianet News TeluguAsianet News Telugu

12 కొత్త జిల్లాలకే జగన్ పరిమితం: ఆ జిల్లాలు ఇవే....

ఎపిలో కొత్తగా 12 జిల్లాలనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిమితవుతున్నారు. ఆ కొత్త జిల్లాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రతి లోకసభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తున్నానని ఇచ్చిన ఎన్నికల హామీని జగన్మోహన్ రెడ్డి అమలు చేయబోతున్నారు.

YS Jagan proposes additional 12 districts
Author
Amaravathi, First Published Sep 13, 2019, 8:43 PM IST

గత కొన్ని రోజులుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై అనేక చర్చలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయమై  ప్రభుత్వ వర్గాలనుంచి వచ్చిన ఒక లీకు నేపథ్యంలో ఈ చర్చ మరింత జోరందుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ విషయం గురించి గవర్నర్ విశ్వభూషణ్ కు కూడా వివరించాడనే వార్త వెలుగులోకి రావడంతో నూతన జిల్లాల ఏర్పాటు ఖాయమని అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. 

కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయనే వార్త దాదాపుగా ఖచ్చితమని తేలేలా కనపడడంతో ఇప్పుడు చర్చ ఇంకాస్త ముందుకెళ్లి కొత్త జిల్లాలుగా వేటిని ప్రకటిస్తారనే కుతూహలం సర్వత్రా నెలకొంది. జగన్ ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు. ఈ విషయమై అధికారంలోకి రాగానే అధికారులను ఈ విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక సమగ్ర నివేదిక ఇవ్వవలిసిందిగా ఆదేశించారు. 

జగన్ ఆదేశాలను అందుకున్న అధికారులు వెనువెంటనే రంగంలోకి దిగి కసరత్తులు ప్రారంభించారు కూడా. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు జనాభా నిష్పత్తి, నియోజకవర్గాల రేజర్వేషన్లను కూడా పరిగణలోకి తీసుకొని నూతనంగా 12 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ నూతన 12 జిల్లాలతో కలుపుకొని 25 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్లమెంట్ స్థానాలు కూడా 25 కావడంతో జగన్ ఇచ్చిన ఎన్నికల హామీని కూడా నెరవేర్చినట్టు అవుతుంది. 

జగన్ సూచించిన పార్లమెంటు స్థానం ఆధారంగానే అధికారులు నియోజకవర్గాలను గ్రామ స్థాయి సరిహద్దుల వరకు వేరుచేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతానికి అందుతున్న 'లీకు' సమాచారం మేరకు కొత్తగా ఏర్పాటు చేయబోయే 12 జిల్లాలు ఇవే. 

1. అనకాపల్లి 
2. అరకు 
3. అమలాపురం 
4. రాజముండ్రి 
5. నరసాపురం 
6. విజయవాడ 
7. నరసరావుపేట 
8. బాపట్ల 
9. నంద్యాల 
10. రాజంపేట 
11. హిందూపురం 
12. తిరుపతి 

నూతన జిల్లాల ఏర్పాటును దృష్టిలో ఉంచుకొనే జగన్ భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలను చేపట్టినట్టు తెలుస్తోంది. ఇలా నూతన జిల్లాల ఏర్పాటువల్ల పాలన వికేంద్రీకరణ జరిగి ప్రజలకు మరింత చేరువ కావొచ్చని భావిస్తోంది జగన్ సర్కార్. తాను ప్రవేశపెట్టిన నవరత్నాలను ఖచ్చితత్వంతో ప్రజలకు అందించేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని జగన్ ఆశిస్తున్నారు. 

పాలనాపరమైన లాభాలతో పాటు ఎన్నికల హామీని కూడా నిలబెట్టుకున్నవాడవుతాడు జగన్. కోల్డ్ స్టోరేజ్ లో పడకేసిన రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఇది ఎంతో ఉపయుక్తకరంగా మారుతుంది. తద్వారా రాష్ట్ర ఖజానాకు కూడా ఆదాయం పెరుగుతుంది. 

జనవరి 26వ తేదిన ఈ కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారుచేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios