విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీల అమలుకు భారీగా వ్యయం కానుంది. విలేజ్ వాలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల ఏర్పాటు వంటి హామీల అమలుకు దాదాపు రూ.3,708 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ స్థితిలో గ్రామ సచివాలయాల ఏర్పాటు, గ్రామ స్వచ్ఛంద సేవకుల నియమాకాలకు పెట్టే వ్యయం అదనపు భారమే అవుతుంది. విలేజ్ వాలంటీర్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1500 ఖర్చవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. గ్రామ సచివాలయాలకు సంబంధించి 2,208 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భావిస్తోంది. 

వివిధ పథకాల అమలులో అవినీతిని నిర్మూలించే చర్యల్లో భాగంగా జగన్ మే 30వ తేదీన ఆ రెండు పథకాలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే విషయాన్ని చెప్పారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందించడానికి ఆగస్టు 15వ తేదీ నాటికి నాలుగు లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. 

ప్రతి 50 ఇళ్లకు ఒక్క వాలంటీర్ ఉంటాడని, వారికి నెలకు 5 వేల రూపాయలేసి వేతనం చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.  గ్రామ సచివాలయాల ఏర్పాటుకు అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతిన శ్రీకారం చుట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు. 

ప్రతి గ్రామ సచివాలయంలో పది మంది ప్రభుత్వ సిబ్బంది ఉంటారని, అందుకు 1.6 లక్షల సిబ్బందిని నియమిస్తామని జగన్ చెప్పారు. కాల్ సెంటర్ ను సిఎంవో కార్యాలయానికి అటాచ్ చేస్తామని, ప్రభుత్వ పథకాల అమలులో అవినీతిపై నేరుగా ఆ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. ఆ కాల్ సెంటర్ ను ఆగస్టు 15వ తేదీన ఏర్పాటు చేస్తారు.