అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ కూర్పు చాలా మారింది. పార్టీ విధేయులకే పెద్దపీట వేసిన వైయస్ జగన్ కూర్పులో మాత్రం అనుకోకుండా గమ్మత్తు చోటు చేసుకుంది. 

జగన్ కేబినెట్ లో అన్నయ్యలు చోటు సంపాదించుకోగా తమ్ముళ్లకు నిరాశే మిగిలింది. అన్నయ్యలకు పోటీగా తమ్ముళ్లు కూడా మంత్రి వర్గంలో స్థానం కోసం ప్రయత్నించినప్పటకీ ఆ ప్రయత్నం ఫలించలేదు. జగన్ కేబినెట్ లో అన్నయ్యలే ఛాన్స్ కొట్టేశారు.   

శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు అన్నయ్యలు గత ఎన్నికల్లో గెలిచారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు గెలుపొందగా ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నుంచి గెలుపొందారు. 

అయితే నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్నారు. ధర్మాన కృష్ణదాస్ తమ్ముడు ధర్మాన ప్రసాదరావు కంటే ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 2004 ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 

2009లో కూడా ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావులు గెలుపొందారు. అయితే ధర్మాన కృష్ణదాస్ మాత్రం వైయస్ జగన్ వెంట నడిస్తే ధర్మాన ప్రసాదరావు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. వైయస్ జగన్ వెంట వెళ్లినందుకు అనర్హత వేటుకు కూడా బలయ్యారు ధర్మాన కృష్ణదాస్. వైయస్ జగన్ వెంట ఆది నుంచి కలిసిపనిచేయడంతో ఆయనను మంత్రి పదవి వరించింది. 

ఇకపోతే విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ, ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్యలు కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే బొత్స సత్యనారాయణ మాత్రం జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. 

విజయనగరం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతోపాటు పార్టీ సీనియర్ నేతగా ఆయనకు జగన్ గుర్తింపునిచ్చారు. ఫలితంగా ఆయనకు జగన్ కేబినెట్ లో స్థానం దక్కించుకోగా తమ్ముడు మాత్రం కేబినెట్ లో చోటు దక్కించుకోలేదు. 

మరోవైపు చిత్తూరు జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం. 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్ళపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

 వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంతేకాదు పార్టీకి ఆర్థికంగా కూడా సహాయపడ్డారు. రాయలసీమలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊడ్చిపెట్టుకుపోవడానికి వ్యూహం రచించింది, చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే. పార్టీపట్ల విధేయత, వైయస్ కుటుంబానికి వీరవిధేయుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి వరించింది. 

అయితే ఈ ఎన్నికల్లో మరో ముగ్గురు అన్నదమ్ములు విజయం సాధించారు. ఏపీ రాజకీయాల్లో రాంపురం సోదరులుగా గుర్తింపు పొందిన సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున ఘన విజయం సాధించారు. అయితే ఈముగ్గురులో ఒక్కరికి కూడా మంత్రి పదవి వరించకపోవడం గమనార్హం. బాలనాగిరెడ్డికి వస్తుందని అంతా ఊహించినప్పటికీ చివరినిమిషంలో చోటు దక్కించుకోలేకపోయారు బాలనాగిరెడ్డి.