విజయవాడ: రాష్ట్రంలో కొత్తగా 60 కార్పోరేషన్లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సామాజిక వర్గాల వారీగా కార్పోరేషన్లను ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కార్ తలపెట్టింది. బీసీలకు 57, ఈబీసీలకు మరో మూడు కార్పోరేషన్లను ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారు.

ఎన్నికల సమయంలో కార్పోరేషన్లను ఏర్పాటు చేస్తానని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.ఈ హామీ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కార్పోరేషన్లను ఏర్పాటు చేయాలని తలపెట్టారు.

ఎన్నికలకు ముందు బీసీ సంఘాలకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయమై హమీలిచ్చారు. అదే వేదికపై బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి జగన్ ఎమ్మెల్సీని ఇస్తామని ప్రకటించారు.ఈ హామీని అమలు చేశారు.

ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నాలను ప్రారంభించారు.

ఇందులో భాగంగానే ఏపీ సీఎం కొత్తగా 60 కార్పోరేషన్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కార్పోరేషన్ల ఏర్పాటు కోసం రంగం సిద్దం చేశారు.

 బీసీ సంక్షేమ శాఖ ప్లాన్‌ ‘ఏ’ కింద 16.ప్లాన్‌ ‘బీ’ కింద మరో 41 కార్పొరేషన్ల ఏర్పా టుకు ప్రతిపాదనలను అధికారులు సిద్దం చేస్తున్నారు. కమ్మ, రెడ్డి, క్షత్రియులకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్పోరేషన్ ను ఏర్పాటు చేసేందుకు కూడ ప్రభుత్వం రంగం సిద్దం చేసింది.కొత్తగా కార్పోరేషన్ల ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉంది. 

పార్టీ బలోపేతం ఇంత కాలం కష్టపడిన నేతలకు కార్పోరేషన్ చైర్మెన్ పదవులను కట్టబెట్టే అవకాశం ఉంది. పార్టీ ఆవిర్భావం నుండి తన వెన్నంటి ఉన్న నేతలకు వైఎస్ జగన్ కార్పోరేషన్ చైర్మెన్ పదవులను ఇచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

మంత్రివర్గంలో కూడ తన వెన్నంటి ఉన్న వారికి సీఎం వైఎస్ జగన్ పార్టీ పదవులను కట్టబెట్టారు. నామినేటేడ్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేతలకు కార్పోరేషన్ చైర్మెన్ పదవులను సీఎం జగన్ కట్టబెట్టనున్నారని చెబుతున్నారు.