అమరావతి: రాష్ట్రంలోని బెల్టు షాపులను తొలగించాలని ఆంధ్రప్రదేశల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఆదాయ మార్గాలపై, ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. 

దశలవారీగా మద్యపానాన్ని నిషేధించే మార్గాలను అన్వేషించాలని జగన్ అధికారులకు సూచించారు. మద్యపానానికి సంబంధించి ఆయన  అధికారుల నుంచి ప్రాథమిక సమాచారాన్ని తీసుకున్నారు. మద్యపాన నిషేధం అమలుపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. 

సంక్షేమ కార్యక్రమాలపై దెబ్బ పడకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం అవసరమని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండే ఆదాయ మార్గాలను అన్వేషించాలని ఆయన ఆదేశించారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో జరిగిన సమీక్షా కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఆర్థికశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి.సాంబశివరావు, పీవీ రమేష్‌, ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌, అదనపు కార్యదర్శి ధనంజయరెడ్డి పాల్గొన్నారు. 

సోమవారం విద్యాశాఖ, మంగళవారం జలవనరులు, గృహ నిర్మాణశాఖల అధికారులతో సీఎం జగన్‌ సమీక్షిస్తారు. బుధవారం వ్యవసాయానుబంధ శాఖ, గురువారం సీఆర్డీఏపై ఆయన సమీక్షలు నిర్వహిస్తారు.