ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయనకు నామినేటెడ్ పోస్టు దక్కే అవకాశం ఉంది. చీరాల నియోజకవర్గం టీడీపీ శాసనసభ్యుడు కరణం బలరాం వైసీపితో నడవడానికి సిద్ధపడ్డారు. సాంకేతికంగా మాత్రమే ఆయన వైసీపీలో చేరలేదు. ఆయన కుమారుడు వెంకటేష్ మాత్రం వైసీపీలో చేరారు.

కరణం బలరాం కారణంగా ఆమంచి కృష్ణమోహన్ అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. దాంతో ఆయన సంతృప్తిపరిచే దిశగా జగన్ అడుగులు వేశారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆమంచి శుక్రవారంనాడు వైఎస్ జగన్ ను కలిశారు. ఆమంచికి ఏదైనా పదవి ఇవ్వాలని బాలినేని జగన్ ను కోరినట్లు తెలుస్తోంది. దాంతో కొత్తగా ఏర్పడే ప్రాంతీయ బోర్డుల చైర్మన్ పదవిని ఆమంచికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కరణం బలరాం, పాలేటి రామారావు తదితరులను వైసీపీకి చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆమంచి కృష్ణమోహన్ దూరం కాకుండా చూసుకోవడానికి సిద్ధపడ్డారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో చీరాల మున్సిపాలిటీకి కరణం వెంకటేష్ ప్రోత్సాహంతో ఓవైపు, ఆమంచి ప్రోత్సాహంతో మరో వైపు వైసీపీ నాయకులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు.

ఆ విషయం కూడా వైఎస్ జగన్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం సాధించడానికి ప్రయత్నించాలని వైఎస్ జగన్ బాలినేనికి సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతున్న విషయం తెలిసిందే.