అలా ఎలా చేస్తారు సార్? చట్టంలో ఎక్కడైనా అలా ఉందా?: కోర్టు మెట్లెక్కిన జగన్
శాసనసభలో ప్రతిపక్షం, ప్రతిపక్ష నేత ఉండటం ఎంతో అవసరమని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజలందరి సమస్యలను లేవనెత్తేందుకు, రాష్ట్రంలో న్యాయ పాలన సక్రమంగా సాగేలా చూసేందుకు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిన అవసరముందన్నారు.
చట్ట ప్రకారం శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శానసనభ పక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదానిచ్చే విషయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మౌనం పాటిస్తున్నారని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, మంత్రి పయ్యావుల కూడా ఈ విషయంలో ముందుగానే స్పందించారని.. దీన్ని బట్టి ప్రతిపక్ష నేత హోదా విషయంలో వారు ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోందన్నారు.
శాసనసభలో ప్రతిపక్షం, ప్రతిపక్ష నేత ఉండటం ఎంతో అవసరమని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రజలందరి సమస్యలను లేవనెత్తేందుకు, రాష్ట్రంలో న్యాయ పాలన సక్రమంగా సాగేలా చూసేందుకు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిన అవసరముందని తన వ్యాజ్యంలో వివరించారు. విస్తృతాధికారంతో అధికారాన్ని చెలాయిస్తామంటే కుదరదని, రాజ్యాంగ సిద్ధాంతాల ప్రకారం దానిని నియంత్రించే పరిస్థితి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.
చట్ట విరుద్ధంగా వెళ్లడానికి వీల్లేదు..
‘ప్రస్తుతం శాసనసభలో మాది మాత్రమే ఏకైక ప్రతిపక్ష గొంతుక అన్నది కాదనలేని సత్యం. ప్రజా సమస్యలను లేవనెత్తి వాటిపై మాట్లాడే హక్కు నాకుంది. అయితే, ఈ హక్కును మా పారీ్టకొచి్చన సీట్ల గణాంకాల ఆధారంగా కాలరాయడానికి వీల్లేదు. సంప్రదాయాలతో పేరుతో చట్ట విరుద్ధంగా వెళ్లడానికి ఎంతమాత్రం వీల్లేదు’ అని జగన్ తన వ్యాజ్యంలో తెలిపారు.
కనీస సీట్లు రాకపోయినా..
‘అసెంబ్లీలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లను సాధించకపోయినా కూడా పార్టీలు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందిన ఉదంతాలెన్నో ఉన్నాయి. 1994లో మొత్తం 294 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లే గెలుచుకున్నప్పటికీ, ఆ పార్టీ నేత పి.జనార్దన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది.
2015లో ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లే వచ్చినప్పటికీ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. రాజ్యాంగంలో ఎక్కడా ప్రతిపక్ష హోదా రావాలంటే నిర్దిష్టంగా ఇంత శాతం మేర సీట్లు గెలుపొంది ఉండాలని లేదు. అలాగే, కనీస సీట్ల ఆధారంగా ప్రతిపక్ష పార్టీ హోదానివ్వడమన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంప్రదాయంగా లేదు’ అని జగన్ తన పిటిషన్‌లో వివరించారు.
గొంతెత్తకూడదన్నదే ఉద్దేశం..
‘శాసనసభలో నాకు ప్రతిపక్ష నేత హోదానివ్వాల్సిన అవసరం గురించి నేను గతనెల 24న స్పీకర్‌కు అన్ని వివరాలతో లేఖ రాశాను. నిజానికి.. ఆయన మొదటినుంచీ నాపై వ్యతిరేక వైఖరితో ఉన్నారు. నేను ఎన్నికల్లో ఓడిపోయానే తప్ప చనిపోలేదని ఒకసారి.. నేను చచ్చేవరకు కొట్టాలని మరోసారి ఆయనన్నారు. పయ్యావుల కేశవ్ కూడా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరాదని నిర్ణయించినట్లు మీడియాకు చెప్పారు.’
‘శాసనసభలో పేదల తరఫున ఎవరూ మాట్లాడకూడదన్నదే అధికార పార్టీ ప్రధాన ఉద్దేశం. వీరి వైఖరే నేను ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి కారణమైంది. అలాగే, అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నాకు అర్థమైంది. నిజానికి.. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్స్ చట్టం ప్రకారం నన్ను ప్రతిపక్ష నేతగా నియమించాల్సి ఉంది.’
‘అయితే, రాజకీయ కారణాలతో ఆ పని చేయడం లేదు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నాకు ప్రతిపక్ష నేత హోదానిచ్చేలా ఆదేశాలివ్వండి.. లేని పక్షంలో మీరే ఆ హోదాను ఇస్తూ ఆదేశాలు జారీచేయండి’ అని వైఎస్ జగన్ తన పిటిషన్‌లో కోరారు.