హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాజభవన్ చేరుకున్నారు. ఆయన గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రాజభవన్ కు చేరుకున్నారు. సరిగ్గా నాలుగున్నర గంటలకు ఆయన గవర్నర్ ను కలిశారు.

తనను కొత్తగా ఎన్నికైన పార్టీ శాసనసభ్యులు వైసిపి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానం ప్రతిని జగన్ గవర్నర్ నరసింహన్ కు అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆయనను ఆహ్వానించారు. 

గవర్నర్ తో భేటీ తర్వాత  జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును సాయంత్రం ఐదున్నర గంటలకు కలుసుకున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆయన కేసీఆర్ ను ఆహ్వానించారు. ఆ తర్వాత హైదరాబాదులోని తన నివాసం లోటస్ పాండుకు సాయంత్రం ఆరున్నర గంటలకు చేరుకుంటారు. కేసీఆర్ తో భేటీలో జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఉన్నారు.