అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చిరాకు పెట్టే ఓ సంఘటన చోటు చేసుకునే అవకాశం ఉంది. వైఎస్ జగన్ ను వివాదంలోకి లాగిన ఐఎఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ ఉదంతం ప్రేరణతో తెలుగులో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది.

ఎర్రచీర ఫేమ్ సిఎచ్. సత్యసుమన్ బాబు ఈ సినిమాను తీయబోతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది సంస్థ డైరెక్టర్ జనరల్ గా జగన్ ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

ఈ బదిలీ ఉదంతంతో పాటు మరిన్ని వాస్తవ సంఘటనలను తీసుకుని ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. మంత్రుల వల్ల, ముఖ్యమంత్రుల వల్ల ఐఎఎస్ అధికారి ఎదుర్కున్న సమస్యలను చిత్రంలో చూపిస్తారని అంటున్నారు ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. 

కథ మొత్తం నిజాయితీ గల ఐఎఎస్ అధికారి చుట్టూ తిరుగుతుంది. అవినీతిని అరికట్టడానికి ఐఎఎస్ అధికారి తీసుకునే శ్రమను చిత్రంలో చూపిస్తారు. రాజకీయ నాయకుల వల్ల అధికారులు ఎదుర్కునే కష్టాలను ఇందులో చూపిస్తారని అంటున్నారు. ఎల్వీ, జగన్ ఎపిసోడ్ కూడా ఇందులో ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది.