హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ఫిక్స్ అయ్యింది. ఈనెల 21న వైఎస్ జగన్ లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. లండన్ లో  విద్యనభ్యసిస్తున్న తన కుమార్తెను కలిసేందుకు వైఎస్ జగన్ లండన్ వెళ్లనున్నారు. 

ఈనెల 21 నుంచి నాలుగురోజులపాటు లండన్ లోనే వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వైఎస్ జగన్ తోపాటు తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, కుమార్తె కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రజా సంకల్పయాత్ర అనంతరం జగన్ లండన్ వెళ్తారని ప్రచారం జరిగింది. 

అయితే వైఎస్ జగన్ లోటస్ పాండ్ లో విశ్రాంతి తీసుకుని, రాజకీయాలపై దృష్టిసారించారు. ఇక ఈనెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో లండన్ టూర్ కు ప్లాన్ వేశారు. 

ఇకపోతే లండన్ టూర్ పై వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై స్పందించిన సీబీఐ న్యాయ స్థానం ఈనెల 18 నుంచి మార్చి 18 మధ్య వారం రోజుల పాటు లండన్ వెళ్లేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.