అమరావతి: రాష్ట్రంలోని 70 లక్షల మందికి ఆగష్టు 15వ తేదీన ఇళ్లపట్టాలను ఇస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి ప్రతిపక్షం అడ్డుపడుతోందని ఆయన విమర్శించారు.

కృష్ణా జిల్లా గాజులపేటలో మొక్క నాటి జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని బుధవారం నాడు ఏపీ సీఎం  వైఎస్ జగన్ ప్రారంభించారు. జగమంతా వనం.. ఆరోగ్యంతో మనం అనే నినాదంతో వన మహోత్సవంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

also read:ఉద్యోగం కోసం ఆసుపత్రిలోనే పరీక్ష రాసిన కరోనా రోగి

ఏడాదిలో 20 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం  ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం తమ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 15 వేల లేఔట్లలో పేదలకు ఇళ్ల పట్టాలను అందిస్తామని ఆయన వివరించారు. 

రాష్ట్రంలో టీడీపీ అన్యాయమైన రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఇళ్లు లేని వాళ్లు ధరఖాస్తు చేసుకొంటే వారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కూడ రాష్ట్రప్రభుత్వం  సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.