అమరావతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అభయ్ ప్రాజెక్టును ఏపీ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు.

సోమవారం నాడు తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రవాణా శాఖ పర్యవేక్షణలో  ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు.

మహిళ భద్రత కోసం అభయం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత వంటి పథకాలను తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 శాంతి భద్రతలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పారు.  అభయం యాప్ ను కూడ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.

ప్రతి ఆటో, క్యాబ్‌లలో నిర్భయంగా ప్రయాణం చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతోందన్నారు సీఎం.ఈ ప్రాజెక్టు కింద రూ.138.48 కోట్లు ఖర్చు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద రూ .80.09 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం 55.39 కోట్లను ఖర్చు చేయనుంది. 

నామినేటేడ్ పదవులు, పనుల్లో కూడా 50 శాతం మహిళలకు రిజర్వేషన్లను  అమలు చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను కూడా మహిళలకు కేటాయించామని ఆయన పేర్కొన్నారు.

మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏ మాత్రం రాజీలేదన్నారు. రాష్ట్రంలోని ప్రయాణీకులను తరలించే ప్రైవేట్ వాహనాలకు దశలవారీగా ఐవోటీ బాక్సులను అమరుస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఐదు వేల వాహనాలకు ఈ పరికరాలను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

ఆటోలు,క్యాబ్ లలో ఎక్కే ప్రయాణీకులు తమ మొబైల్స్ లో అభయం యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. వాహనం ఎక్కేముందు వాహనానికి అంటించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది.ఈ వాహనాల్లో ప్రయాణం చేసే వారు ఏదైనా ఇబ్బంది ఎదురైతే వాహనం నెంబర్ ను పంపితే జీపీఎస్ ద్వారా తెలుసుకొనే వీలుంటుందన్నారు.