విడాకులు తీసుకున్నాక గుర్తొచ్చింది: చంద్రబాబుపై జగన్

First Published 28, May 2018, 8:34 AM IST
YS Jagan lambasts Chnadrababu on special category status
Highlights

నాలుగేళ్లు బిజెపితో కాపురం చేసి, విడాకులు తీసుకున్న తర్వాత ఈ పెద్దమనిషికి ప్రత్యేక హోదా మళ్లీ గుర్తుకు వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నారు.

భీమవరం: నాలుగేళ్లు బిజెపితో కాపురం చేసి, విడాకులు తీసుకున్న తర్వాత ఈ పెద్దమనిషికి ప్రత్యేక హోదా మళ్లీ గుర్తుకు వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నారు. 

ఇప్పుడు పోరాటం చేస్తున్నాడని, తమ పార్టీ ఎంపీల మాదిరిగా టీడీపి పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదని ఆయన అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 

హోదా కోసం తన పుట్టిన రోజునాడు రూ.30 కోట్లు ఖర్చుపెట్టి ధర్మపోరాట దీక్ష చేశారని ఆయన అన్నారు. తెలంగాణకు వెళ్లి ఈ రాష్ట్రం తన వల్లే ఏర్పడిందని చెప్తారని, ఆంధ్రాకు వచ్చినపుడు అన్యాయంగా విభజించారని అంటారని, ఆ రకంగా చంద్రబాబు రెండు నాలుకల ధోరణిలో వ్యవహరిస్తున్నారని అన్నారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గత నాలుగేళ్లుగా చంద్రబాబు మర్చిపోయాడని, మళ్లీ ఇప్పుడు హామీలన్నీ పూర్తి చేస్తానని చెప్పి మోసం చేస్తున్నారని అన్నారు. నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. కరెంటు బిల్లులతో షాక్‌ ఇస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నో మోసాలు చేసిన చంద్రబాబును ప్రజలు క్షమించకూడదని, క్షమిస్తే రాజకీయాల్లో విశ్వసనీయతకు అర్ధం ఉండదని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పెద అమిరం సభలో జగన్‌ సమక్షంలో వెఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన చేరికతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని జగన్‌ అన్నారు. 

loader