ఆంధ్రప్రదేశ్ లో వరుసగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారు. అధికారపార్టీ భాద్యులు అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, నేడు వసంత కృష్ణప్రసాద్ రాజీనామా అంటూ ప్రచారం.. నియోజకవర్గ ఇంచార్జ్ ల మార్పులు.. ఇవన్నీ ఎందుకు? ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇలాంటి చర్యలకు కారణమేంటి? ఇది పార్టీకి మంచి చేసేదేనా?

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి మళ్ళీ ఎలాగైనా విజయాన్ని సాధించాలని వ్యూహాలు చేస్తున్నారు. టార్గెట్ 2024గా పెట్టుకుని వేగంగా పావులు కదుపుతున్నారు. 2019లో తిరుగులేని విజయాన్ని అందుకున్న వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో కూడా అలాగే విజయాన్ని కైవసం చేసుకోవాలని ఆశిస్తోంది. ఈసారి ఎన్నికల్లో 151 స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది.

దీనికోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. గెలిచే అభ్యర్థులను రంగంలోకి దింపబోతున్నారు. దీనికోసం ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారు. సర్వేల ఆధారంగా పార్టీలో ప్రక్షాళన చేపట్టారు. సర్వేల ఆధారంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గెలిచే అవకాశాలు లేని నేతలను పక్కన పెడుతున్నారు. వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 11 నియోజకవర్గాల్లో కొత్త వారిని నియమించారు.

Highlights of 2023 : ఆంధ్ర ప్రదేశ్ ని కుదిపేసిన సంఘటనలు ఇవే...

ఈ 11 నియోజకవర్గాల్లో ఐదు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మొదటి ఫేజ్ లో నలుగురికి స్థానభ్రంశం కలిగింది. మేకతోటి సుచరితకు తాడికొండ బాధ్యతలు అప్పగించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కు కొండేపి బాధ్యతలు, మరో మంత్రి విడుదల రజనికి చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ బాధ్యతలు, నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు.

గ్రూపు తగాదాల విషయంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొండేపి ఇన్చార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబును పార్టీలో ఓవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాదు ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలే హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో వరికుటి అశోక్ బాబుకు వేమూరు బాధ్యతలు ఇచ్చింది పార్టీ. అలాగే గ్రూపు తగాదాలతో తలనొప్పిగా మారిన అద్దంకి విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తోంది.

పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న అద్దంకి ఇన్చార్జిగా ఉన్న కృష్ణ చైతన్యను తప్పించింది. ఆ బాధ్యతలను హనిమిరెడ్డికి ఇచ్చారు. దీంతో కమ్మ సామాజిక వర్గం నుంచి బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినట్లు అయ్యింది. ఇక మరోవైపు తాడికొండ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా చర్చనీయాంశంగానే మారింది. తాడికొండ నుంచి గతంలో ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆమె టిడిపి అభ్యర్థికి ఓటేశారు. హై కమాండ్ ఆదేశాలను ధిక్కరించారు. ఈ నేపథ్యంలోనే తాటికొండ శ్రీదేవి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ఆ తరువాత తాడికొండ శ్రీదేవి స్థానంలో కత్తెర సురేష్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మార్పుల్లో భాగంగా కత్తెర సురేష్ కుమార్ స్థానంలో తాడికొండకు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితను బాధ్యురాలిగా నియమించారు. మరోవైపు మంగళంకిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డిని బాధ్యతలనుంచి తొలగించి గంజి చిరంజీవిని తెరమీదికి తీసుకువచ్చారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. తనను కాదని గంజి చిరంజీవిని తెరమీదికి తీసుకురావడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఆర్కే స్థానంలో గంజి చిరంజీవిని బరిలోకి దించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

ఈ మార్పుతో ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి బదులు బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ బీసీ అభ్యర్థిని నిలపాలని వైసీపీ యోచిస్తుంది. ఈ నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని తుర మీదికి తీసుకువచ్చింది. ఇక గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి వయసు రీత్యా వెనకబడడంతో ఆయన కొడుకు అయిన దేవన్ రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. కానీ దేవన్ రెడ్డి గెలిచే అవకాశాలు లేవని సర్వేలో తేలడంతో ఇక్కడి నుంచి వరికుటి రామచంద్రారావుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.

రేపల్లె నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ బాధ్యతలను ఈ వూరు గణేష్ కు కట్టబెట్టింది అధిష్టానం. రేపల్లె నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలు వైసిపి అభ్యర్థిగా మోపిదేవి పోటీ చేశారు. కానీ ఆయన ఓడిపోయారు. ఈ మార్పుతో ఇక్కడ బీసీ స్థానంలో కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినట్లు అయింది. ఈ మార్పులతో వైసీపీలో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. అసంతృప్తులు రగులుతున్నాయి. అయితే, ఈ మార్పులు మంచివా? కావా? అనేది తేలాలంటే ఎన్నికల దాకా ఆగాలేమో...