అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న తరుణంలో ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందజేశారు. ప్రముఖ నటుడు, మాజీకేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందజేశారు. 

ఈనెల 30న విజయవాడలో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని తప్పని సరిగా హాజరుకావాల్సిందిగా కోరారు. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను సైతం వైయస్ జ గన్ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. 

చిరంజీవి, పవన్  కళ్యాణ్ లతోపాటు సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలను కూడా వైయస్ జగన్ ఆహ్వానించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు సైతం వైయస్ జ గన్ ఆహ్వానం అందజేశారు. 

ఇకపోతే ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఫోన్ చేశారు వైయస్ జగన్. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ కాల్ ని లిఫ్ట్ చేయలేకపోయారు చంద్రబాబు. అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నేరుగా ఆహ్వానం అందజేశారు.