కడప: 14నెలల విరామం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత జిల్లాలో అడుగుపెట్టారు. 13 జిల్లాలలో 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్ విరామం అనంతరం తన సొంత ఇలాఖాలో అడుగుపెట్టారు. 

అడుగుపెట్టగానే రైల్వే కోడూరులో ఆందోళన చేస్తున్న ఉద్యానవన కళాశాల విద్యార్థులను పరామర్శించారు. తమకు ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు హెచ్ఈవో జీవో విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు 15 రోజులుగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో జగన్ నేరుగా వెళ్లి వారిని కలిశారు. 

వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసే గ్రామ సెక్రటేరియట్ లో సాంకేతిక నిపుణుల విభాగంలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

ఏప్రిల్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వచ్చిన ఆరు నెలల్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామని, అందులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సెక్రటేరియట్ లో భాగంగా లక్ష 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 

హార్టికల్చర్ ఎక్స్ టెన్సియల్  ఆఫీసర్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో రైతులకు సేవలందించేందు హార్టికల్చర్ విద్యార్థులను వినియోగిస్తామన్నారు. విద్యార్థులు ఆందోళనలు విరమించుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చర్మం చాలా లావు అయిపోయిందన్నారు. 

ప్రతీ గ్రామంలో హార్టికల్చర్ ఆఫీసర్  ఉండేలా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి చెయ్యాలన ఆలోచన లేదన్నారు. విద్యార్థులు తమ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకోవాలని వైఎస్ జగన్ చెప్పారు.