అమరావతి:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాదు పర్యటన రద్దయింది. ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి ఆయన శుక్రవారం హైదరాబాదు వచ్చే కార్యక్రమం తొలుత ఖరారైంది. ఆ తర్వాత ఆయన దాన్ని రద్దు చేసుకున్నారు. 

సీబీఐ, ఈడీ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండడంతో జగన్ పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. ప్రతి శుక్రవారం తమ ముందు హాజరు కావాలని సీబీఐ కోర్టు వైఎస్ జగన్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. హైదరాబాదు పర్యటన రద్దయిన నేపథ్యంలో ఆయన నాడు - నేడు కార్యక్రమంపై అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

ఇదిలావుంటే, ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు.

ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరు కావాల్సి ఉండింది. 

సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జిషీట్లు, ఈడీ వేసిన 5 అభియోగపత్రాలపై విచారణకు హాజరు కావడానికి ఆయన సిద్ధపడ్డారు. కానీ ఆయన పర్యటన రద్దయింది. ఆయన హైదరాబాదు పర్యటన ఖరారైంది. 

కోర్టుకు హాజరై తిరిగి ఆయన హైదరాబాదు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరిగి వెళ్తారని కూడా చెప్పారు.  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. వివిధ కారణాలతో ఆయన ఎప్పటికప్పుడు కోర్టు హాజరు నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందుతూ వస్తున్నారు.