న్యూ ఢిల్లీ: తెలుగింటి కోడలికి ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో మరోసారి కీలక చోటు దక్కింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖ ఇచ్చిన మోదీ ఈసారి ఏకంగా ఆర్థికశాఖను కట్టబెట్టడం విశేషం. దీంతో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం కోడలికి అరుదైన గౌరవం లభించినట్లైంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల సాధన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద సవాల్ గా మారింది. గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా గానీ పునర్విభజన చట్టంలోని హామీలు కానీ, వెనుకబడిన ప్రాంతాల నిధులు గానీ సాధించడంలో విఫలమైందని వైసీపీ ఆరోపించింది. 

తీరా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సాధించలేని హామీలను సాధించే అంశం జగన్ భుజస్కందాలపై పడింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలు సాధించుకోవాలని జగన్ వ్యూహరచన చేస్తున్నారు. 

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యత కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అదృష్టం నిర్మలాసీతారామన్ పేరిట తలుపుతట్టినట్లైంది. ఎందుకంటే నిర్మలా సీతారామన్ తెలుగింటి ఆడపడుచు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ పై జగన్ ఆశలు పెట్టుకున్నారు.

గతంలో ఆమె విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె మోదీ కేబినెట్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన తరుణంలో నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటించారు. 

అంతేకాదు తన మెట్టినిల్లు అయిన నరసాపురంలోని తీరగ్రామాలైన తూర్పుతాళ్లు, వేములదీవి పంచాయతీలను దత్తత తీసుకున్నారు. దాదాపు రూ.20 కోట్లతో ఆ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కూడా. 

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత, పునర్విభజన చట్టంలోని హామీల అమలు ఎంత విలువైనవో అనే ఆలోచన ఆమెకు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. తెలుగు రాష్ట్ర కోడలిగా  రాష్ట్రానికి ఆమె సహాయ సహకారాలు అందిస్తారని వైయస్ జగన్ ప్రభుత్వం భావిస్తోంది. 

ఇకపోతే నిర్మలా సీతారామన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు చెందిన కోడలు. తమిళనాడుకు చెందిన1986లో నరసాపురంలో రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన పరకాల ప్రభాకర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి వాగ్మయి అనే కుమార్తె కూడా ఉన్నారు. 

నిర్మలా సీతారామన్ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖమంత్రిగా పనిచేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈనేపథ్యంలో నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ ను తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. 

నరేంద్రమోదీ కేబినెట్ విస్తరణలో ఆమె కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2017 నుంచి 2019 అంటే ఎన్డీఏ పూర్తికాలం వరకు రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. భారతదేశంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. 

తాజాగా నిర్మలా సీతారామన్ మరో రికార్డు సృష్టించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రెండో మహిళ నిర్మలా సీతారామన్. గతంలో ఇందిరా గాంధీ ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. 1970-71లో ఆర్థిక మంత్రి ఇందిరాగాంధీ పనిచేశారు. ఆమె తర్వాత కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేస్తున్న రెండో మహిళ నిర్మలా సీతారామన్.
  
ఇకపోతే ఇందిరాగాంధీ చేపట్టిన కీలక మంత్రి పదవులను నిర్మలా సీతారామన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇందిరాగాంధీ పేరిట ఉన్న రక్షణ శాఖ మంత్రి, ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి రికార్డులను చెరిపివేశారు నిర్మలా సీతారామన్.