ఉండవల్లి: ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. చంద్రబాబు నివాసం పక్కన ఉన్న ప్రజా వేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రజా వేదికను తమకు కేటాయించాలని గతంలో జగన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. 

చంద్రబాబు రాసిన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదు. దాన్ని స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయించింది. టీడీపీకి సంబంధించిన సామాగ్రిని తీసుకుని వెళ్లాలని ఆ నేతలకు సీఆర్డీయే అధికారులు సూచించారు. ఈనెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

దాంతో ప్రజావేదికను స్వాధీనం చేసుకోడానికి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్, సీఆర్డీయే అధికారులు ప్రజావేదిక వద్దకు వచ్చి పరిశీలించారు. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ప్రజా వేదికను స్వాధీనం చేసుకోవడాన్ని టీడీపి నేతలు తప్పు పడుతున్నారు.