అమరావతి: సీఆర్డీఎ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్ కు పంపించింది. నిబంధనల మేరకు వారు బిల్లును గవర్నర్ కు పంపించారు. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

గవర్నర్ ఆమోదం తెలిపితే సీఆర్డీఎ రద్దు కావడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం ఏర్పడుతుంది. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతిలో అసెంబ్లీ క్యాపిటల్ ను, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

అయితే, ఆ బిల్లులకు శాసన మండలిలో అడ్డంకులు ఏర్పడ్డాయి. శాసన మండలిలో బిల్లులు పెట్టిన గడువు ఈ నెల 17వ తేదీతో గడిచింది. నెల రోజులు గడిచినందున ఆ రెండు బిల్లులను ప్రభుత్వాధికారులు ఆమోదం కోసం గవర్నర్ కు పంపించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ చోటు చేసుకుంది. ఈ స్థితిలో ఆ రెండు బిల్లులపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.


మూడు రాజధానుల ఏర్పాటు చట్టప్రకారం సాధ్యం కాదని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రాజధాని ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సిఫార్సుల మేరకు రాజధాని ఏర్పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉందని ఆయన అన్నారు. 

అందుకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంచుకుందని చెప్పారు. విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందని, రాజధానులు అని లేదని, వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే విభజన చట్టంలో సవరణలు అవసరమని ఆయన అన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గవర్నర్ వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

వివాదాస్పద బిల్లులపై భిన్నాభిప్రాయులు ఉన్నందు వల్లనే కేంద్రం సలహా తీసుకోవాలని తాము కోరినట్లు ఆయన తెలిపారు. చట్టం అయిందని ప్రభుత్వం ఒక్కసారి భావించిన తర్వాత అది రాష్ట్రపతికి పంపించాలా, లేదా న్యాయ సలహా కోరాలా అనేది గవర్నర్ ఇష్టమని ఆయన అన్నారు.

పరిపాలనా వికేంద్రమరణ, సీఆర్డిఏ బిల్లులు ఇంకా పెండింగులోనే ఉన్నాయని, ప్రజలకు సంబంధించిన బిల్లులకు శాసన మండలి ఆమోదం లేదా తిరస్కరణ లభించలేదని ఆయన గుర్తు చేశారు. ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఆయన అడిగారు. సెలెక్ట్ కమిటీ వద్ద పెండింగులో ఉన్న బిల్లులను మళ్లీ సభ ముందుకు తేవడం తగదని ఆయన అన్నారు.