Asianet News TeluguAsianet News Telugu

ఏపీ పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల్లోనూ రివర్స్ టెండరింగ్

ఆంధ్రప్రదేశ్ పట్ణణ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల్లోనూ రివర్స్ టెండరింగ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.5వేల కోట్ల పనులను ఏపీ టిడ్కో చేపట్టింది ఇందుకు సంబంధించి వివిధ స్థాయిల్లో టిడ్కో ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటి వరకు 25 శాతం కూడా పూర్తి కాని ప్రాజెక్ట్‌ల రివర్స్ టెండరింగ్‌కు ఈ నిర్ణయం వల్ల వీలు కలుగుతుంది. 

YS jagan Govt plans to implement reverse tendering in ap urban housing project
Author
Amaravathi, First Published Oct 16, 2019, 6:17 PM IST

ఆంధ్రప్రదేశ్ పట్ణణ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల్లోనూ రివర్స్ టెండరింగ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.5వేల కోట్ల పనులను ఏపీ టిడ్కో చేపట్టింది ఇందుకు సంబంధించి వివిధ స్థాయిల్లో టిడ్కో ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇప్పటి వరకు 25 శాతం కూడా పూర్తి కాని ప్రాజెక్ట్‌ల రివర్స్ టెండరింగ్‌కు ఈ నిర్ణయం వల్ల వీలు కలుగుతుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖరారు చేశారు. 

పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో కూడ అవినీతికి ఆస్కారం లేకుండా ముందుకు వెళ్లేందుకు వీలుగా రివర్స్ టెండరింగ్ చేస్తున్నట్టుగా జగన్ ప్రకటించారు. రూ. 10 లక్షల విలువైన కొనుగోళ్లు లేదా పనుల నిర్వహణకు సంబంధించి రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని జగన్ సర్కార్ ప్లాన్ చేసింది.

ఈ మేరకు విధి విధానాలను రూపొందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. 

ప్రభుత్వ కాంట్రాక్టులు, సర్వీసులు, కొనుగోళ్లలో పారదర్శకత, ప్రజాధనం ఆదా కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జగన్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. 

రూ. 100 కోట్లకు పైబడిన కాంట్రాక్టు పనులను ముందుగా జ్యూడిషీయల్ కమిటికి నివేదించిన తర్వాత ఖరారు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విధానాన్ని మరింత పకడ్భందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

కనీసం ఐదుగురు లేదా బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60 శాతం మంది మాత్రమే రివర్స్‌ టెండరింగ్‌కు అర్హులయ్యేలా చూడాలన్నారు. దీనివల్ల బిడ్డింగ్‌ ప్రక్రియలో కోట్‌ చేసేటప్పుడు వాస్తవికత ఉంటుందని రివర్స్‌ టెండరింగ్‌లో మరింత పోటీకి దారితీస్తుందని జగన్ చెప్పారు.

రూ.10 లక్షలు పైబడి, రూ.100 కోట్ల లోపు ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్ల విషయంలో కూడా ఇలాంటి నిబంధనలను అమలు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పనులు, సర్వీసులు, కాంట్రాక్టుల్లో శాశ్వత ప్రాతిపదికన పారదర్శకత తీసుకొచ్చేలా ఒకే విధానం ఉండాలని ఆదేశించారు. 

టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా ఈ విధానం ఉండాలన్నారు. టెండర్లలో పాల్గొనాలంటే నిరుత్సాహం కలిగించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. టెండర్లలో పేర్కొంటున్న అంశాలు  అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. తక్కువ ధరకు కోట్‌ చేసిన టెండర్‌ వివరాలను ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ సైట్‌లో వారం రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 

ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని సూచించారు. ఎక్కువ మంది పోటీలో పాల్గొనేలా ప్యాకేజీలు ఉండాలని చెప్పారు. 

ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్ల టెండర్లలో ఇ–ప్రొక్యూర్‌మెంట్, జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ పక్రియలు సాఫీగా జరిగేలా సహకారం అందించేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఎప్పటికప్పుడు ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్లను పరిశీలిస్తూ రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ సాఫీగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ఈ అధికారిదేనని సీఎం స్పష్టం చేశారు. 

ఈ అధికారి జ్యుడిషియల్‌ ప్రివ్యూకు అవసరమైన వివరాలు అందించడంతో పాటు ప్రాధామ్యాలను నిర్దేశిస్తారని చెప్పారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూకు టెండర్‌ పంపగానే సంబంధిత శాఖ అధికారి వెళ్లి అక్కడ న్యాయమూర్తికి వివరించాలని కూడా సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఆయా శాఖల నుంచి సాంకేతిక సహకారం అందించే వ్యక్తులను వెంటనే సూచించాలన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios